విద్యా వ్యవస్థలో మార్పులు చెయ్యాలి : ప్రొ. కోదండరాం

విద్యా వ్యవస్థలో మార్పులు చెయ్యాలి : ప్రొ. కోదండరాం
  • మొక్కుబడి వ్యవహారాలతో
  •  ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దలేం    
  • మూకుమ్మడిగా సీఎంకు సూచనలు చేద్దాం
  • విద్యపై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొ. కోదండరాం

పంజాగుట్ట, వెలుగు: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, పేద విద్యార్థుల జీవితాల్లో ఉన్నత లక్ష్యాల సాధన కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని ప్రొ. కోదండరాం అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్​లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వెంకటరెడ్డి అధ్యక్షతన ‘విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కోదండరాం మాట్లాడుతూ..  ప్రభుత్వ బడుల్లో విద్య నాణ్యతకు కావలసిన నిధులపై గతంలో చాలాసార్లు ప్రభుత్వాలకు విన్నవించామని, ఈసారి సీఎం రేవంత్ రెడ్డికి మూకుమ్మడిగా సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వానికి ఒక కమిటీగా ఏర్పడి సూచనలు చేయాలని, కేవలం మొక్కుబడి వ్యవహారాలతో విద్యను తీర్చిదిద్దలేమని చెప్పారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కోట్లు వెచ్చించి చేస్తున్న ఫుట్‌‌ బాల్ టోర్నీ, అందాల పోటీలతో సమాజానికి ఏమాత్రం ప్రయోజనం లేదని, పేదల విద్యపై దృష్టి సారించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, బీఎస్పీ అధ్యక్షుడు ఇబ్రాం షేఖర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు కన్నెగంటి రవి, లక్ష్మీనారాయణ, మాధురి, మైత్రి తదితరులు పాల్గొన్నారు.