ఈనెల 7న వీ6 చానల్లో తెలంగాణ జాతిపితను అధికారికంగా ప్రభుత్వం ఏవిధంగా ప్రకటించగలుగుతుంది అని యాంకర్ సౌజన్య చర్చలో పాల్గొన్న అద్దంకి దయాకర్‌ను, కోదండరాంను, నన్ను అడిగింది. ఈ చర్చ గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని 6వ తేదీనాడు ఆయన విగ్రహం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో తీర్మానించిన నేపథ్యంలో జరిగింది. ఏప్రిల్ 6 న ఆ రోజుకు 29 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దర్‌పై కాల్పులు జరిపించి 6 తుపాకీ గుండ్లు ఆయన శరీరంలోకి దింపిన రోజు. ఆ కాల్పులు 1997 మార్చి 8, 9 తేదీలలో భువనగిరిలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి నాంది పలికిన సభలో గద్దర్ కీలకపాత్ర నిర్వహించినందువల్ల జరిగాయి.
తమ పాలన సుస్థిరమైనదనుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని తన సంపూర్ణ ఆధిపత్యంలో పాలిస్తున్న దశలో పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్న గద్దర్ పాల్గొనడం వల్ల ఒక భయంతో జరిపించినవి. ఆయనను చంపేయడం ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఆయన శరీరం నుంచి 5 గుండ్లను డా..బీరప్ప తీసేసినా, ఒక్క తుపాకీ గుండును తప్పని పరిస్థితుల్లో కడుపులోనే వదిలేసినా 6 ఆగస్టు 2023 వరకు బతికి.. తెలంగాణ సాధించేంతవరకు పోరాడి, దాన్ని అభివృద్ధి చెందిన, సామాజిక తెలంగాణగా మార్చే లక్ష్యంతో పోరాడుతూనే చనిపోయాడు. కాబట్టి ఆయనను తెలంగాణ
జాతిపితగా గుర్తించాలనే డిమాండ్ ముందుకువచ్చింది. తెల్లాపూర్ సభలోనూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్‌ను జాతిపితగా గుర్తించాలనే డిమాండ్ ముందుకుతెచ్చింది. ఈ అవసరం ఎందుకొచ్చిందంటే కేసీఆర్ 17 ఫిబ్రవరి నాడు తెలంగాణ రాష్ట్రమంతటా తానే తెలంగాణ జాతిపిత అని హోర్డింగులు, కటౌట్లు పెట్టించుకుని ప్రచారం మొదలుపెట్టాడు. దీనితో ఆయన హోదా పెరిగి 2028లో తిరిగి అధికారంలోకి వస్తే ఆ బిరుదును అధికారికంగా ప్రకటించుకోవడం ఖాయం. ఆయన బతికుండగానే స్వయంగా ఈ ప్రచారానికి పూనుకున్న కేసీఆర్ ఒక ప్రమాదకర, ఇమ్మోరల్, ప్రతిపాదనను ముందుకుతెచ్చారు. ఈ పద్ధతి ద్వారా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాను, ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష పదవిని సొంత అస్తిత్వం కోసం దుర్వినియోగం చేసి, అర్హుడుకాని ఒక చారిత్రక హోదాను సొంతం చేసుకోవడం.. ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం. తెలంగాణ చైతన్యంపై దాడి. కేసీఆర్ కుటుంబం ఇంతటితో ఆగదు. ‘జాతిపిత’ ప్రచారంతో అధికారంలోకి రాగానే తన కేబినెట్అప్రూవల్ద్వారా దాన్ని స్థిరపర్చి మొత్తం హుస్సేన్‌సాగర్ బుద్ధవనాన్ని కేసీఆర్ వనంగా మార్చే ప్రయత్నం ఉంది. అందుకే ఈ దురుద్దేశ ప్రచారం.
గద్దర్‌ను జాతిపితగా..ప్రభుత్వం ఎలా ప్రకటించవచ్చు
ఇప్పుడు కేసీఆర్ కంటే వంద రెట్లు అందుకు అర్హుడైన గద్దర్ పేరు తెరమీదకొచ్చింది. మొదటి దశ తెలంగాణ ఉద్యమానికి (ముల్కి) నాయకులైన సంగంరెడ్డి సత్యనారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేవశరావు జాదవ్, జయశంకర్వంటివారు ఇప్పటికే చనిపోయినా, గద్దర్‌కి ఉన్న త్యాగం, పోరాట చరిత్ర, పాదయాత్రలు, పాటలు, ఆటలు, తాత్వికత, చంద్రబాబుతో కాల్చబడ్డ చరిత్ర కేసీఆర్‌ను ఆ పోటీలో ఉండకుండా చేయగలదు. కనుక గద్దరే అందుకు అర్హుడు. ప్రభుత్వం జాతిపితను ఎలా ప్రకటించవచ్చు. ఇది రాజ్యాంగ పదవికాదు. కానీ, రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను తెలంగాణ జాతిపక్షిగా, జింకను తెలంగాణ జంతువుగా (నిజానికి బర్రెనో, గొర్రెనో ప్రకటించాల్సి ఉండే) ప్రకటించింది. అందెశ్రీ పాటను తెలంగాణ జాతీయగీతంగా ప్రకటించింది. అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక రూపంగల స్త్రీ విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ప్రకటించింది. ఇదే పద్ధతిన కేబినెట్ రెజుల్యూషన్‌తో గద్దర్ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాల్సి ఉంటుంది. జనవరి 30, 1948లో గాంధీ హత్య తరువాత ప్రధానమంత్రి నెహ్రూ గాంధీని జాతిపితగా ప్రకటించాడు. ఇప్పడు కూడా అలాగే చేయవచ్చు. అదికూడా రాజ్యాంగంతో సంబంధం లేని ప్రకటన. ఒకసారి ఆయన్ని జాతిపితగా గుర్తించాక ఆయనకు ముందు ముందు వచ్చే ప్రభుత్వమైనా ఆ స్థిరమైన స్థానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
గద్దర్‌పై వ్యతిరేకత అర్థరహితం
ఆయనపై పాఠ్యాంశాలు పెట్టి పిల్లలకు పాఠాలు చెప్పాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత గద్దర్ విషయంలో అర్థరహితమైంది. ఆయన హింసావాది, మాజీ నక్సలైట్అని ఆయన తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని భూస్థాపితం చేయాలని వారి ఆలోచన. కానీ సావర్కర్ కూడా పెద్ద హింసావాది. అహింసను ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా మాత్రమే ప్రతిపాదించలేదు. ఆది హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ తమ శత్రువు అనుకున్న జాతిపిత మహాత్మా గాంధీని చంపడానికి నాధూరాం గాడ్సేను వాడుకున్నారు. సావర్కర్ ఆ కేసులో నిందితుడు కూడా. కానీ ఇప్పడు గాంధీ జాతిపిత హోదాను తీసేసి, సావర్కర్‌కు జాతిపిత హోదా ఇవ్వాలని, భారతరత్న ఇవ్వాలని వారే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ చనిపోయే 15 ఏండ్ల ముందే మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశాడు. అహింసా సిద్ధాంత పునాదులేసిన బుద్ధిజాన్ని, దాన్ని ఆచరణలోకి తెచ్చిన అంబేద్కరిజాన్ని స్వీకరించాడు. కానీ, సావర్కర్ మాత్రం చనిపోయేవరకు హింసా సిద్ధాంతాన్ని నమ్మారు. ఆ నమ్మకం ఉన్న సంస్థలోనే ఉన్నారు. గద్దర్ ఆ నిర్మాణంలో కళాకారుడు, రచయిత, ప్రజా ఆకర్షణ శక్తే కాని తుపాకి పట్టి ఒకరిని చంపిన దళ సభ్యుడు కాడు. కనుక వారి వాదనను తెలంగాణ ప్రజలు లెక్కలోకి తీసుకోరు. అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తెలంగాణ పోరాటంలో చేసిందేమీ లేదు. సంవత్సరానికోసారి దత్తాత్రేయతో అలయ్ బలయ్ ఆర్గనైజ్ చేయడం తప్ప. చాలామంది తెలంగాణవాదులు కూడా అలయ్ బలయ్ ఒక పోరాట రూపమని నమ్మారు. కానీ, అది ప్రజాస్వామ్య చైతన్యానికి, దళిత బహుజన హిందూత్వ వ్యతిరేక చైతన్యానికి ట్రాప్ మాత్రమే.
ఏం చేయాలి
తెలంగాణ పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ పాల్గొన్నారు. రోడ్లమీద వంటావార్పులు చేశారు. అందులో మేధావులనుకునేవారు అన్నీ వదిలిపెట్టి తిరిగారు. విద్యార్థులు చదువును నిద్రపుచ్చి రోడ్లెక్కి ఉద్యమించారు. పోలీసులు దెబ్బలు తిన్నారు. కళాకారులు అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. రోజూ ధూం ధాం అంటూ గద్దర్‌తోపాటు లేదా విడిగా రోడ్లమీదనే ఉన్నారు. వీరందరిలో కొంతమంది కేసీఆర్ జాతిపిత అని మరీ పాటలు రాస్తున్నారు. పాడుతున్నారు. కానీ, గద్దర్ గురించి అలా రాసేవారు, పాడేవారే కరువైనట్టు కనపడుతున్నారు. ఇప్పడు తెలంగాణ దొరల డబ్బులతో ఆటను, పాటను, చివరికి జాతిపిత బిరుదును కొనుక్కునే రోజులు. పదేండ్లు పదవుల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు ఆయన ఫొటో ఇంట్లో పెట్టుకుని అంబేద్కర్ కంటే గొప్పోడు అంటున్నారు. గద్దరేనా నేనెందుకు తెలంగాణ జాతిపిత కావొద్దు అని ఆలోచించేవారూ ఉన్నారు. ఇదొక ప్రమాదకర పరిస్థితి. ఆంధ్రా పత్రికలు, టీవీలు గద్దర్ జాతిపితనా అన్నట్టు ఆశ్చర్యకర భయంలో ఉన్నాయి.
ఒక దళితుడు తెలంగాణ జాతిపిత అయితే రాష్ట్రం, దేశం ఎటువైపు పోతున్నట్లు! నిజంగానే కలియుగమొచ్చిందా అని నిద్రపట్టని స్థితిలో ఉన్నారు. కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతుల్లోని సోషల్ మీడియా ఏమైంది? అదీ కొంత భయంలోనే ఉన్నట్టు కనపడుతోంది! కేసీఆర్ పిత అని పాడినా, చెప్పినా పైసలొస్తాయి. మరి గద్దర్ పిత అని చెపితే పైసలు రావుకదా! ఇది తెలంగాణ చైతన్య స్థితి. ఈస్థితిలో గద్దర్ జాతిపిత ఉద్యమం రేపొచ్చే ఎన్నికల్లోనే ఒక సవాలు అయితే తప్ప కాంగ్రెస్ కూడా పట్టించుకోకపోవచ్చు. ఇదొక కొత్త సవాలు. కొత్త సమస్య. ఆనాటి ఉద్యమకారులు తిరిగి కొత్త
చైతన్యంలోకి రాకపోతే అధికారంలో వాటా, ఉద్యోగాలు రావు. ఇదొక అవకాశం. తిరిగి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని తవ్వడానికి.. ఆ చైతన్యాన్ని పునరుజ్జీవించగల సింబల్ తెలంగాణలో గద్దర్ తప్ప మరొకరు లేరు. ఇక కదలడమే కర్తవ్యం.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
