అంబర్‌పేట, వెలుగు: బినామీ లావాదేవీలు చట్టవిరుద్ధమని, అలాంటి ఆస్తులను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే జప్తు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలంగాణ, ఏపీ అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ వై.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ త్రీస్టార్‌లో శుక్రవారం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఏ సాంబమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.
నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం–1988ను సవరించి, ‘బినామీ లావాదేవీల(నిషేధ) సవరణ చట్టం–2016’గా మార్చిందని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల జైలు శిక్షతో విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీఏ చంద్రశేఖర్ వేముల, సీఏ ఆశిష్ జోషి, సోమేశ్వర్ నెమ్మాని, సీఏ రామ్‌దేవ్ బుటాడా, కాంపిటేషన్ కమిటీ చైర్మన్ సీఏ అమృత్‌కుమార్ కోటా, సీఏ పి.వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
