తెలంగాణకు చేయూత ఇవ్వండి

తెలంగాణకు చేయూత ఇవ్వండి

వ్యవసాయానికి చేయూత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  “కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు  రైతుబంధు అమలు విధానాలు మార్గదర్శకం కావడం సంతోషం. కేంద్రం ప్రతిపాదిస్తున్న పలు పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు పునరుద్ధరించాం. నీతి అయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రం నిధులివ్వలేదు. మద్దతు ధరను కొన్ని పంటలకే పరిమితం చేయడంతో రైతులు నష్టపోతున్నారు, రాష్ట్రం మీద భారం పడుతోంది. అన్ని పంటలకూ మద్దతు ధర ఇవ్వాలి.  ఆయిల్ పామ్ కు సహకరించాలి. వేరుశనగ ఉత్పత్తిలో పలుమార్లు జాతీయ రికార్డ్ సాధించాం. తెలంగాణలో  వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేశాం. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం అందించాం” అని అన్నారు. సమావేశంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్స్,  అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ కమిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అంశాలపై చర్చించారు.