సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో సూడో పోలీసులు హల్‌చల్ చేశారు. అచ్చం పోలీసుల్లా నటిస్తూ.... అమాయక ప్రజలను అటెన్షన్ డైవర్షన్ ద్వారా దోచుకుంటున్నారు. తాజాగా ఒక మహిళను బురిడీ కొట్టించి ఆమె కళ్ళముందే నాలుగు తులాల బంగారాన్ని మాయం చేశారు ఈ కేటుగాళ్లు.
అసలేం జరిగిందంటే.. నిన్న మొన్న ఇక్కడ నేరం జరిగింది.. పరిస్థితి అస్సలు బాలేదు అంటూ రోడ్డుపై వెళ్లే పాదాచారులను, వాహనదారులను ఆపి డబాయించారు. పోలీసులమంటూ నమ్మబలికి.. వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసి భద్రంగా బ్యాగులో పెట్టుకోవాలంటూ సూచించారు. వీరి మాటలు నమ్మిన ఒక బాధితురాలు తన మెడలోని బంగారు పుస్తెల తాడును తీసి ఒక కాగితంలో పెట్టి బ్యాగులో వేసుకోబోయింది.
అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అలా కాదు ఇలా పెట్టుకోవాలి అంటూ సాయం చేస్తున్నట్టు నటించిన సూడో పోలీసు.. మహిళ బ్యాగులో చేయి పెట్టి క్షణాల్లో నగలను మాయం చేశాడు. అది గమనించని మహిళ ఇంటికి వెళ్లి చూసుకోగా బ్యాగులో నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. లబోదిబోమంటూ బాధితురాలు, ఆమె బంధువులు స్పాట్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ సూడో పోలీసుల టీం కదలికలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నలుగురు వ్యక్తులు ఒక టీంలా వచ్చి ఈ దారి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతం మూడు పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఉండటంతో.. కేసు నమోదు విషయంలో అసలు పోలీసులు అయోమయంలో పడ్డారు. దీనివల్ల నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
