పొల్యూషన్​తో కరోనా ముప్పు..ఈసారి పటాకులు కాల్చొద్దు

పొల్యూషన్​తో కరోనా ముప్పు..ఈసారి పటాకులు కాల్చొద్దు

హైదరాబాద్​, వెలుగు: పొల్యూషన్​, చలి తీవ్రత కారణంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదముందని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ ఒక్కసారికి పటాకులు కాల్చకుండా దీపావళి పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​ కోఠిలోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పొల్యూషన్​, చలి వల్ల ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన దగ్గర దసరా, బతుకమ్మ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నందున కేసులు పెరగలేదన్నారు. ఇప్పుడు కూడా ఎవరికివారే ఇంట్లోనే పండగ జరుపుకోవాలని కోరారు. టపాసుల పొల్యూషన్​తో ఆస్తమా, శ్వాసకోశ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాలుష్యంతో గాలి బరువుగా మారి ఒకే చోట ఎక్కువ సేపు ఉంటుందని, అప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే ముప్పు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ ఒక్కసారికి పటాకులకు దూరంగా ఉంటే మంచిదని ఆయన సూచించారు. ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్,​ పూర్తి స్థాయిలో ట్రీట్​మెంట్  అందుబాటులోకి వచ్చే అవకాశముందన్నారు.