- ప్రచారంలో అడుగడుగునా అడ్డుకుంటున్న ఓటర్లు
- పార్టీ సమావేశాల్లో భగ్గుమంటున్న లీడర్లు
- ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై నిలదీసిన కేయూ స్టూడెంట్స్
- తెలంగాణ భవన్ విమెన్స్ డే వేడుకల్లో నేతల గుస్సా
- ఒకే ఇంటికి మూడు నాలుగు పదవులా అంటూ గరం
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీకి అటు జనంతో పాటు ఇటు సొంత లీడర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న గులాబీ నేతలను ఎక్కడిక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఏం చేసిన్రు? ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకున్నరా? అంటూ యూనివర్సిటీల స్టూడెంట్లు, నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీ ఏమైందని, నిరుద్యోగ భృతి ఎటుపోయిందని, వీసీలను ఎందుకు నియమిస్తలేరని నిలదీస్తున్నారు. మరోవైపు పార్టీ సంస్థాగత సమావేశాల్లో, బహిరంగ వేదికలపైన సొంత లీడర్ల నుంచి నిరసన సెగ తగులుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సొంత లీడర్లే ఎండగడుతున్నారు. ఎన్నికలప్పుడే కేడర్ గుర్తుకొస్తుందా..? అని కడిగిపారేస్తున్నారు. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్పెట్టినా.. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటీముట్టనట్లు ఉంటున్నారు. యూనివర్సిటీల్లో ప్రచారానికి వెళ్లాలంటేనే వణికిపోవాల్సి వస్తోందని, పార్టీ అనుసరించిన విధానాలతోనే ఈ దుస్థితి వచ్చిందని కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు పార్టీ సమావేశాల్లో ఎప్పుడు ఏ లీడర్ లేచి తమ బాధను వెళ్లగక్కుతారో తెలియడం లేదని అంటున్నారు.
మొన్న పల్లాను ఎండగట్టిన సొంత నేత
ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహాక సమావేశానికి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాగా టీఆర్ఎస్ చిలుకూరు మండల మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య నిలదీశారు. ‘‘ఆరేండ్ల కింద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నరు’’ అని పల్లాపై విరుచుకుపడ్డారు. పూర్తి బాధ్యతలను నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీసుకుంటేనే.. ఓటు వేస్తామని చెప్పారు. దీంతో వేదికపై ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కంగుతిన్నారు.
ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకుంటలే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవట్లేదు. అందరినీ ప్రచారంలో పాల్గొనాలని హైకమాండ్ ఆదేశించినప్పటికీ వాళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ప్రచారంపై రోజువారీగా రిపోర్టులు పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరు పట్ల చాలా మంది ఎమ్మెల్యేలు మనస్తాపానికి గురై ప్రచారానికి దూరంగా ఉంటున్నారని, పైగా ప్రచారంలో పాల్గొంటే అడుగడుగునా ఓటర్లు నిలదీస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్గా పనిచేయకపోవడంతో పల్లా తన ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో సొంత నెట్ వర్క్ను ఏర్పాటు చేసుకుని, వారికే చాలాచోట్ల ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు లీడర్లు చెప్తున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అభ్యర్థిత్వాన్ని పార్టీ లీడర్లు పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదని, ఉన్నఫళంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించి, ప్రచారం చేయండని అంటే ఎలా కుదురుతుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
అటు కేయూలో.. ఇటు తెలంగాణ భవన్లో..
సోమవారం ఒకే రోజున వరంగల్లో, హైదరాబాద్లో జరిగిన రెండు ఘటనలు టీఆర్ఎస్ కేడర్ను షాక్కు గురి చేశాయి. ఎన్నికల ప్రచారం కోసం కేయూకి వెళ్లిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వచ్చిన లీడర్లను వర్సిటీలో అడుగుపెట్టకుండా స్టూడెంట్లు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన విమెన్స్ డే వేడుకల్లో ప్రభుత్వం, పార్టీ తీరును టీఆర్ఎస్ మహిళా లీడర్లు నిలదీశారు. పెండ్లయి, పిల్లలు పుట్టినంక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నారని జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మన్నె కవిత ఆరోపించారు. ఉద్యమ కారులను పక్కన పెట్టేసి, అడ్డమైనోళ్లను అందలం ఎక్కిస్తున్నారని, ఒకే ఇంటికి మూడు నాలుగు పదవులు ఇవ్వడం ఏమిటని ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ అరుణ నిలదీశారు.
కేటీఆర్ మీటింగ్కు సగం మంది డుమ్మా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ లీడర్లను భాగస్వాములను చేసేందుకు ఫిబ్రవరి 27న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీటింగ్ పెడితే సగం మంది లీడర్లు డుమ్మా కొట్టారు. దీంతో కేటీఆర్.. ఎవర్నీ బతిమిలాడేది లేదని, అలిగి ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీటింగ్కు ఎవరొచ్చారో, రానోళ్లు ఎవరో చూస్తున్నానని మండిపడ్డారు. మీటింగ్ తర్వాత పార్టీ లీడర్లతో కలిసి భోజనం చేయాల్సి ఉన్నా మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు.
