ఎవరైతే మాకేంటి..రూల్స్ లెక్కచేయని పబ్స్

ఎవరైతే మాకేంటి..రూల్స్ లెక్కచేయని పబ్స్

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో పబ్బులు  రూల్స్ బ్రేక్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అడ్డాగా మారాయి. చట్టాలు, పోలీసులను లెక్కచేయకుండా లిక్కర్ డ్రింకింగ్, డగ్స్ సప్లయ్ తో యువతను మత్తులో దించుతున్నాయి. ముంబయి,ఢిల్లీ,బెంగళూర్ సిటీల తరహాలో సిటీలో పెరిగిపోతున్న పబ్ కల్చర్ యువతను పెడదారి పట్టిస్తోంది. కనీస సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదు.  ఇలాంటి పబ్ కల్చర్ పై అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో  ‘రూల్స్.. గీల్స్ జాన్తానై’ అంటూ పబ్ నిర్వాహకులు ఇష్టమొచ్చినట్టుగా వాటిని నడుపుతున్నారు.

జీహెచ్ఎంసీ దాడులు

గ్రేటర్ పరిధిలోని సుమారు 750 బార్లు ఉండగా ఇందులో  అధికారికంగా 150కి బార్లలో  పబ్స్ నిర్వహిస్తున్నారు. మరో 50కి పైగా అనధికారికంగా నడుస్తున్నాయి. ఇందులో బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ ప్రాంతంలో 50కి పైగా పబ్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం విశాలమైన ప్రాంతంలోనే పబ్స్ ఏర్పాటు చేయాలి. ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఫైర్ సేఫ్టీ,సెక్యూరిటీ,పార్కింగ్ రూల్స్ పాటించాలి. లోపల బయట సీసీ కెమెరాలను అమర్చాలి.  కానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా పబ్ నిర్వాహకులు రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఫైర్ సేఫ్టీ లాంటి భద్రతా పరమైన అంశాలను పట్టించుకోవడం లేదు. ఈ నెల 2న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో జరిపిన  దాడుల్లో  రూల్స్ బ్రేక్ చేసిన 10 పబ్స్ ను అధికారులు సీజ్ చేశారు. మరో 26 పబ్స్ కి  నోటీసులు జారీ చేశారు.

వీకెండ్ పార్టీలు  

వీకెండ్ పార్టీలకు అలవాటు పడిన యూత్ ఎక్కువగా పబ్స్ నే అడ్డాగా చేసుకుంటున్నారు. మరోవైపు డ్రగ్స్ అమ్మకాలు కూడా పబ్స్ లో యథేచ్చగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటినా నిర్వాహకులు పబ్స్ ను నడపుతున్నారు. తాగిన మైకంలో పబ్స్ లో గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం.. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు పబ్ కల్చర్ లో కామన్ గా మారాయి.  పబ్ నిర్వాహకులు బౌన్సర్లతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు పబ్స్ లోపల జరిగే గొడవలను అడ్డుకోవడంతో పాటు అందుకు కారకులైన వారిని బయటకు పంపించడమే ఈ బౌన్సర్ల డ్యూటీ. పోలీసులతో సంబంధం లేకుండా పబ్స్ లో ఎలాంటి గొడవ జరిగిన బౌన్సర్లే చూసుకుంటారు.

పబ్స్ బయటే పోలీసులు

అర్ధరాత్రి దాటినా పబ్స్ లో కొనసాగుతున్న పార్టీలు అసభ్యకర పనులకు దారితీస్తున్నాయి.  డ్రగ్స్,తాగిన మైకంలో రోడ్ల మీదకి వచ్చే యువతక న్యూసెన్స్ చేస్తోంది. ఈ సందర్భాల్లో కేవలం రోడ్డుపైన జరిగిన ఘటనలు మాత్రమే పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. పబ్స్ లోపల జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ పై పోలీస్ నిఘా ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్స్ లో గొడవ జరిగిన సమయంలో బాధితులు లేదా నిర్వాహకులు కంప్లయింట్ చేస్తేనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో సీసీ ఫుటేజ్ లపై ఆధారపడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 కాంప్రమైజ్ చేస్తున్నరు

పబ్స్ లో మద్యం మత్తులో జరిగే గొడవలు చాలా వరకు పోలీస్ స్టేషన్ వరకు రావడం లేదు. అందుకు కారణం పబ్స్ లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అని తెలుస్తోంది. ఎలాంటి గొడవ జరిగినా అక్కడికే పరిమితం అయ్యేలా చూస్తున్నారు. ఒకవేళ గొడవలు స్టేషన్ వరకు వచ్చినా పబ్ నిర్వాహకుల చొరవతో కాంప్రమైజ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో చాలా కేసులు పోలీస్ స్టేషన్ కి రాకుండానే సెటిల్ అవుతున్నట్లు సమాచారం. మరో వైపు బౌన్సర్లు దాడులు చేసినప్పుడు మాత్రమే పబ్స్ లోపల జరిగే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. అనుమతులు లేని హుక్కా అమ్మకాలు జరిపితే మాత్రం పోలీసులు పిటీ కేసులు నమోదు చేస్తున్నారు.

వాటర్ ట్యాంక్స్ అందుబాటులో ఉండాలి

పబ్స్ లో డిస్కో సౌండ్స్ లకు అనుగుణంగా లైటింగ్‌‌‌‌ఉంటుంది. ఈ లైటింగ్స్ వల్ల బయటకి వచ్చే వేడికి వైర్లు కరిగిపోయి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశముంది.  ప్రతి 4 నెలలకోసారి వైరింగ్‌‌‌‌ మార్చుకోవాలి. స్ర్పింక్రర్లతో పాటు ఫైర్ సేఫ్టీ పరికరాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ ట్యాంక్స్ లో నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

-శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్ వో, హైదరాబాద్

మైనర్లను రానియొద్దు

నిర్దేశించిన లిక్కర్ మినహా హుక్కా, డ్రగ్స్ అమ్మకాలకు పర్మిషన్ లేదు.  మైనర్లను అనుమతించకూడదు.  యువతులకు రక్షణ కల్పించేలా సెక్యూరిటీ ఉండాలి. లిక్కర్ సప్లయ్ లో రూల్స్ బ్రేక్ చేస్తే ఎక్సైజ్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం

– అంజిరెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఎక్సైజ్

సేఫ్టీ లేకపోతే సీజ్ చేస్తున్నాం

పబ్స్ కి జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది. భవన నిర్మాణం,ఫైర్ సేఫ్టీ,సెక్యూరిటీ,ట్రేడ్ లైసెన్స్, పర్మిషన్ లేని పబ్బులను సీజ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఖైరతాబాద్ జోన్ పరిసర ప్రాంతాల్లోని ఫెర్జీ కేఫ్, జురి, లా వంటేజ్,జెహ్న్10, టోట్,అబసర్బ్ పబ్బులను శుక్రవారం సీజ్ చేశాము.

– ముషారఫ్​అలీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ