ఔటర్ సర్వీసు రోడ్డులో అంధకారం

ఔటర్ సర్వీసు రోడ్డులో అంధకారం
  • నెల రోజులుగా వెలగని స్ట్రీట్ లైట్లు 
  • రాళ్లగూడలో స్తంభాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
  • ఇప్పటికే చోటు చేసుకున్న పలు ఘటనలు  

 శంషాబాద్, వెలుగు: నెల రోజులుగా సర్వీస్ రోడ్ లో వీధి దీపాలు వెలగకపోవడంతో వాన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి కారణంగా ఆ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోతుండగా.. పలువురు బైక్ పై వెళ్లే వారు మృత్యువాత పడగా.. మరికొందరు గాయపడిన ఘటనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సర్వీస్ రోడ్ పై  వీధి దీపాలు వెలగక హిమాయత్ సాగర్ నుంచి శంషాబాద్ వచ్చే రోడ్లపై  అంధకారంగా మారింది. 

దీంతో సర్వీస్ రోడ్డులో వాహనాలు స్కిడ్ అవుతుండగా.. హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఓ వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.  రాళ్లగూడ బ్రిడ్జి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా వాహనదారులను పట్టుకునేందుకే కొన్ని విద్యుత్ స్తంభాలకు పవర్ కనెక్షన్ తొలగించారు. దీంతో చీకటి మయంగా మారిందని వచ్చిపోయేటప్పుడు రాత్రివేళ  యాక్సిడెంట్లు, ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతాయోనని వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రాళ్లగూడ బ్రిడ్జి వద్ద స్తంభాలకు లైట్లకు కనెక్షన్ ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్ లో వెలిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.