- నడిరోడ్డుపై టీచర్ హత్య
- కారుతో గుద్ది.. కత్తులతో పొడిచిన్రు
- ఇచ్చిన డబ్బులకు బదులుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలన్నందుకు దారుణం
- గురువారం తెల్లవారుజామున పాలమూరులో ఘటన
- నిందితుడు కరీంనగర్‌కు చెందిన ఓ రియల్ వ్యాపారి!
మహబూబ్ నగర్, వెలుగు: లాయర్ దంపతులను నడిరోడ్డుపై నరికి చంపిన ఘటనను మరువకముందే మరో దారుణం జరిగింది. ప్రభుత్వ టీచర్ను రోడ్డుపైనే హత్య చేశారు. కారుతో గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. తీసుకున్న డబ్బులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
బైక్‌పై వెళ్తుండగా..
నవాబ్పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నరహరి (40).. చిన్నచింతకుంట మండలం ఉంద్యాలలో ప్రభుత్వ టీచర్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో నివాసిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున భగీరథ కాలనీ దగ్గరలో బైక్పై వెళ్తుండగా.. దుండగులు కారుతో ఢీ కొట్టారు. నరహరి కిందపడిపోవడంతో కారులో నుంచి దిగి కత్తులతో దారుణంగా పొడిచారు. తర్వాత కారు అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న నరహరిని ఆస్పత్రికి తరలించే లోపే ఆయన చనిపోయారు. నిందితులు వాడిన కారుకు నంబర్ ప్లేట్ లేదు. క్లూస్టీం వివరాలు సేకరించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, డెడ్ బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు. బాధితులను మంత్రి శ్రీనివాస్గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమెహన్రెడ్డి పరామర్శించారు.
డబ్బుల గొడవ
నరహరి కొన్నాళ్ల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారులకు డబ్బులు ఇచ్చారని, వాటిని వసూలు చేసుకునే క్రమంలో ఈ మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఇచ్చిన డబ్బులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని పట్టుబట్టడంతో నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన జగదీశ్ ఈ హత్య చేసినట్లు నరహరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జగదీశ్కు రూ.80 లక్షలు అప్పు ఇచ్చినట్లు చెబుతున్నారు. తిరిగి ఇవ్వాలని అడిగితే హత్య చేశారని నరహరి భార్య అరుణ కుమారి చెప్పారు. టీచర్ను హత్య చేసిన జగదీశ్ అలియాస్ జగన్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశాయి. ఈ ఆందోళనలో మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోయపల్లి నర్సింలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
