మైనర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలి: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

మైనర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలి: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్  సీరియస్ అయ్యారు. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  అన్నారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టు ద్వారా విచారణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించి నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తామన్నారు. 

శనివారం విలేకరులతో మాట్లాడిన సీఎం ఫడ్నవీస్..  పూణె మైనర్  రేప్ ఘటన అత్యంత దారుణం, విషాదకరం అన్నారు. చిన్నారిపై అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని..ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి నిందితుడికి మరణశిక్ష పడేలా చేస్తామన్నారు సీఎం ఫడ్నవీస్. ఈ ఘటనపై  ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలన్నారు. అత్యంత  సున్నితమైన ఈ కేసులో రాజకీయం చేయడం తగదన్నారు. 

మహారాష్ట్రలోని పూనే, భోర్ తహసీల్ పరిధిలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నాలుగేళ్ల చిన్నారిని ఒక వృద్ధుడు ఫుడ్ ఇప్పిస్తానని చెప్పి, తనతో తీసుకెళ్లాడు. దగ్గర్లోని ఒక పశువుల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని చంపేశాడు. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.