టోక్యోలో బ్రాంజ్ కైవసం చేసుకున్న పీవీ సింధు
ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన ఇండియా తొలి మహిళగా రికార్డు
‘రియోలో సిల్వర్ గెలిచా. ఈ సారి తప్పకుండా మెడల్ కలర్ మార్చుకొస్తా’ అంటూ టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు అనుకున్నది సాధించింది. తన అంతిమ లక్ష్యమైన గోల్డ్‌ను ముద్దాడలేకపోయినా.. బ్రాంజ్ మెడల్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది. సెమీఫైనల్లో వరల్డ్ నం.1 తై జుయింగ్ అడ్డుదాటలేక తన కలకు దూరమైనప్పటికీ.. చైనా డ్రాగన్ హి బింగ్జియావోను
చిత్తు చేస్తూ ఒలింపిక్స్‌లో సెకండ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించింది..!
ఫైనల్ చేరుకోలేకపోయానన్న బాధ తనది..! పైగా, ప్రత్యర్థికి తనపై మంచి రికార్డు ఉంది..! కానీ, ఒక్క రోజులోనే తన ఆటను మార్చుకొని.. సెమీస్‌లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని.. తన మార్కు దూకుడుతో సింధు.. ప్రత్యర్థి పని పట్టేసింది..! కాంస్యం కొట్టేసింది..! రియోలో రజతకాంతులు విరజిమ్మి ఇండియన్ బ్యాడ్మింటన్ హిస్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన సింధు.. టోక్యోలో కంచు మోతతో దేశంలో అత్యుత్తమ క్రీడాకారుల్లో ముందు వరుసకు దూసుకెళ్లింది..! మన తెలుగు సింధూరం... నిజంగా భారత భాగ్య సింధూరమే..!
టోక్యో: ఇండియా బ్యాడ్మింటన్ బంగారు కొండ పీవీ సింధు టోక్యోలో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆదివారం జరిగిన బాడ్మింటన్ విమెన్స్ సింగిల్స్ థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఏడో సీడ్ సింధు 21–13, 21–15తో వరుస గేమ్స్‌లో చైనా షట్లర్ హి బింగ్జియావోను చిత్తు చేసి ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించింది. రెజ్లర్ సుశీల్ కుమార్ (2008లో బ్రాంజ్, 2012లో సిల్వర్) తర్వాత ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన ఇండియన్‌గా నిలిచింది. టోక్యోలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి రోజే సిల్వర్ నెగ్గగా.. బాక్సర్ లవ్లీనా సెమీస్ చేరి మెడల్ ఖాయం చేసుకుంది.
దూకుడే మంత్రం..
సెమీస్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సింధు ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడింది. తన ట్రేడ్‌మార్క్ జంప్ స్మాష్‌లు, క్రాస్ కోర్టు షాట్లతో చెలరేగింది. తొలి గేమ్ ఆరంభంలోనే 4–0తో లీడ్ సాధించింది. దాంతో బింగ్జియావో ఎక్కువ ర్యాలీలు ఆడిస్తూ సింధు మిస్టేక్స్ చేసేదాకా ఎదురు చూసింది. లాంగ్ ర్యాలీలు ఆడి 5–5తో స్కోరు సమం చేసింది. అయితే, ఇండియా ప్లేయర్ మళ్లీ దూకుడు పెంచి 11–8తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత ర్యాలీల్లో స్పీడు పెంచిన సింధు.. వెంటవెంటనే పాయింట్లు రాబట్టి ఈజీగా తొలి గేమ్ నెగ్గింది. రెండో గేమ్‌లోనూ దూకుడు కొనసాగించిన సింధు ఓ క్రాస్ కోర్టు రిటర్న్‌తో 4–1తో ఆధిక్యం సాధించింది. బింగ్జియావో పుంజుకునే ప్రయత్నం చేసినా.. హాఫ్ స్మాష్‌లు, స్లైస్ షాట్లతో అటాక్ చేసిన ఇండియా షట్లర్ బ్రేక్ టైమ్‌కు 11–8తో లీడ్‌లోకి వచ్చింది. ఈ దశలో లైన్‌పై ఓ స్మాష్ కొట్టిన బింగ్జియావో... ఆధిక్యాన్ని తగ్గించింది. అయితే, లాంగ్ ర్యాలీల్లో ఓపిగ్గా ఆడిన సింధు మరో క్రాస్ కోర్టు డ్రాప్ షాట్‌తో మళ్లీ లీడ్ సాధించింది. దాన్ని కాపాడుకుంటూ తన ట్రేడ్‌మార్క్ స్మాష్‌తో మ్యాచ్ పాయింట్‌పైకి వచ్చింది. ఆపై, చైనా ప్లేయర్ వైడ్ షాట్ కొట్టడంతో విజయానందంలో గట్టిగా అరిచిన సింధు.. కోచ్ పార్క్ తయె సంగ్‌ను గట్టిగా హత్తుకుంది. కాగా, ఫైనల్లో టాప్ సీడ్ యుఫెయ్ (చైనా) 21–18, 19–21, 21–18తో తై జుయింగ్ (తైపీ)పై నెగ్గి గోల్డ్ గెలిచింది.
సరిలేరు నీకెవ్వరు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) కండ్లలో కసి. నరనరాన విజయకాంక్ష. ఎదురుగా ఎవరున్నా ఓడించాలన్న పట్టుదల. తన ఆటలో ప్రపంచంలోనే ది బెస్ట్ అనిపించుకోవాలన్న తపన. అందుకోసం ఎంత కష్టాన్ని అయినా భరించే ఓర్పు. ఎదురుదెబ్బలు తగిలినా.. పైకిలేసే తత్వం. విజయానికి పొంగిపోని.. ఓటమికి కుంగిపోని నైజం. ఇవన్నీ కలగలిస్తే.. ఇండియా బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు. అందుకే.. లెక్కకు మించిన విజయాలు ఆమె సొంతం అవుతున్నాయి. వరుస పెట్టి పతకాలు, రికార్డులు ఆమెకు దాసోహం అంటున్నాయి.
ఐదేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడిన సింధును టోక్యోలో అనేక భావోద్వేగాలు వెంటాడాయి. ఈ మెగా గేమ్స్‌లో ఒకరకంగా ‘ఫేస్ ఆఫ్ ది ఇండియా’ తనే. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ క్వాలిఫై అవ్వలేకపోవడంతో సింధుపై అంచనాలు మరింత పెరిగాయి. వాటిని అందుకునేందుకు సింధు చాలా ఏళ్ల నుంచే పక్కా ప్రణాళికతో శ్రమించింది. ఈ క్రమంలో ఆమె కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తన చిన్ననాటి కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కాదని కొరియా కోచ్ పార్క్ తయె సంగ్ సమక్షంలో సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడమీలో శ్రమించింది. ఆపై, టోక్యోలో పెద్ద స్టేడియాలను దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి షిఫ్ట్ అయింది. ట్రెయినర్ శ్రీకాంత్ వర్మ సాయంతో ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకుంది. అయితే, కరోనా కారణంగా ట్రెయినింగ్‌కు ఆటంకం కలగడంతో న్యూట్రిషన్, రికవరి కోసం మూడు నెలలు లండన్ వెళ్లింది. కానీ, ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చే సరికి పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో లేదు. ఫామ్ కూడా కోల్పోయింది. కానీ, గోపీచంద్ అకాడమీ నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి మారిన సింధు.. టోక్యో టార్గెట్‌గా కొన్ని నెలలు విపరీతంగా కష్టపడింది. సుచిత్రా అకాడమీ నుంచి ప్రత్యేకంగా ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ స్పారింగ్ (ప్రాక్టీస్) పార్ట్‌నర్స్‌తో ప్రాక్టీస్ చేసి తన స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకుంది. టోక్యోలో ఈజీ డ్రా ఎదురైనా గ్రూప్ దశ నుంచి సూపర్ పెర్ఫామెన్స్ చేసిన సింధును సెమీస్‌లో దురదృష్టం వెంటాడటంతో తన స్వర్ణ కల నెరవేరలేదు. అయినా ఒలింపిక్స్‌లో 2 పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ సహా ఐదు మెడల్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ టైటిళ్లు నెగ్గిన సింధు తనేంటో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఆమె మెడల్ క్యాబినెట్‌లో ఒలింపిక్స్ గోల్డ్, వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్ వెలితిగా ఉన్నాయి.. ప్రస్తుతం సింధు వయసు 26 ఏళ్లే. క్రికెట్‌లెజెండ్ కోహ్లీ మాదిరిగా ఓ రేంజ్ ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేసే సింధు ఇంకో ఐదారేళ్లు ఆడటం పక్కా. మూరో మూడేళ్లలోనే పారిస్ ఒలింపిక్స్ (2024) జరుగుతాయి. కాబట్టి మిగిలిన మూడు లక్ష్యాలను నెరవేర్చుకుని కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునే అవకాశం సింధు ముందుంది. వాటిని అందుకున్నా.. అందుకోకపోయినా ఇండియా బ్యాడ్మింటన్ హిస్టరీలో సింధునే ది గ్రేట్.
ఈ లోకంలో లేను...
మెడల్ గెలవడంతో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకుంటే దీని కోసమే చాలా ఏళ్లు కష్టపడ్డా. ప్రస్తుతం నాలో రకరకాల ఎమోషన్స్ పరుగెడుతున్నాయి. బ్రాంజ్ గెలిచానని సంతృప్తి పడాలా.. లేదంటే గోల్డ్ మెడల్ మ్యాచ్ మిస్ అయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆ ఆలోచనలను పక్కనపెట్టి ఈ మ్యాచ్‌లో నా బెస్ట్ ఇచ్చా. ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నా. బాగానే ఆడానని అనుకుంటున్నా. దేశానికి మెడల్ అందించినందుకు గర్వంగా ఉంది.ప్రస్తుతం నేను ఈలోకంలో లేను. ఈ మూమెంట్‌ను పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలని భావిస్తున్నా. నా కోసం నా ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. వారికి రుణపడి ఉన్నా. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తారనకుంటున్నా. ఇండియాలో చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు. నాపై ఏంతో ప్రేమ చూపించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇక, శనివారం ఓడిపోయిన ఇద్దరం ఈ రోజు మ్యాచ్ ఆడాం. అందువల్ల ఇద్దరికీ చాలా కష్టంగానే ఉంటుంది. కానీ దేశానికి ఒలింపిక్ మెడల్ అందించడం అనేది చాలా పెద్ద విషయం. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఆడతా.
–పీవీ సింధు
ర్యాంక్ టీమ్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మొత్తం
1 చైనా 24 14 13 51
2 అమెరికా 20 23 16 59
3 జపాన్ 17 5 9 31
4 ఆస్ట్రేలియా 14 3 14 31
5 ఆర్‌ఓసీ 12 19 13 44
59 ఇండియా 0 1 1 2
ఒలింపిక్స్‌లో రెండు ఇండివిడ్యువల్ మెడల్స్ గెలిచిన ఇండియా తొలి మహిళ సింధు బాక్సర్ లవ్లీనాకు పతకం ఖాయం కావడంతో ..సింధు విక్టరీ తర్వాత టోక్యోలో ఇండియాకు మూడో మెడల్ దక్కినట్టు అయ్యింది.ఒలింపిక్(2). వరల్డ్ చాంపియన్‌షిప్స్(5) విమెన్స్ సింగిల్స్ లో సింధు నెగ్గిన మెడల్స్ సంఖ్య. మరే విమెన్ షట్లర్ ఇన్ని పతకాలుగెలవలేదు.
ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన ఇండియా తొలి మహిళగా సింధు నిలిచింది. నిలకడ, అంకితభావం, సమర్థతకు ఆమె సరికొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. దేశానికి కీర్తిని తెచ్చిన ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు.
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్
పీవీ సింధు అద్భుత పెర్ఫామెన్స్ చూసి మనమంతా ఉప్పొంగిపోయాం. టోక్యోలో బ్రాంజ్ నెగ్గిన సింధుకు కంగ్రాట్స్. ఆమె మన దేశానికి గర్వకారణం. అత్యుత్తమ ఒలింపియన్లలో ఒకరు.
- ప్రధాని నరేంద్ర మోడీ
స్మాషింగ్ విక్టరీ సింధు. గేమ్‌ను డామినేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశావు. నిన్ను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. నీ రాకకోసం ఎదురు చూస్తోంది.
- సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్

