న్యూఢిల్లీ, వెలుగు: దేశ సమగ్రాభివృద్ధి బీసీల అభ్యున్నతితోనే ముడిపడి ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే ఈ బిల్లు సాధ్యమని, త్వరలోనే ఇది పార్లమెంట్ ముందుకు రావాలని ఆకాంక్షించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ/ ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఓబీసీల ప్రధాన డిమాండ్లపై జాతీయ సెమినార్ నిర్వహించారు. వివిధ పార్టీల ఎంపీలు, జాతీయ బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సెమినార్‌కు ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి ప్రతినిధులు, మేధావులు, ప్రొఫెసర్లు, సంఘ సంస్కర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నాగరాజు (కర్నాటక), పాక సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రామారావు (మహారాష్ట్ర) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం, సాధికారత కోసం నూతన బిల్లును త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సెమినార్‌లో బీసీల హక్కులు, సంక్షేమానికి సంబంధించి మొత్తం 13 కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు ఆయన వెల్లడించారు.
