కామెంట్లు కాదు..రీయింబర్స్ మెంట్ ఇవ్వండి..సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ఆర్‌. కృష్ణయ్య ఫైర్

కామెంట్లు కాదు..రీయింబర్స్ మెంట్ ఇవ్వండి..సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ఆర్‌. కృష్ణయ్య ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రశ్నించినందుకు తనపై కామెంట్లు కాదని, విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఉద్యమాలను కించపరచడం తగదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.తెలంగాణలో తాను ఉద్యమాలు చేయొద్దని, తాను ఆంధ్ర ఎంపీనంటూ సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడైనా ఉద్యమాలు చేసే హక్కు తనకు ఉందని చెప్పారు. గత 50 ఏళ్లుగా తాను 16 వేల ఉద్యమాలు చేశానన్నారు. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్‌షిప్‌ల రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణకు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు.  అదేవిధంగా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్వో ఆఫీసుల ముట్టడి చేస్తామన్నారు.  

కొండారెడ్డి పల్లిని ముట్టడిస్తాం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రాష్ట్రంలో విద్యార్థులకు నష్టం కలుగుతున్న వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే కోడంగల్, కొండారెడ్డిపల్లిని ముట్టడిస్తామని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఫీజుల బకాయిలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్లతో సంబంధాలు కలుపుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ..  ఒక ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడకూడదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అల్లుడుది ఆంధ్రా కాదా? అనేది ప్రజలకు చెప్పాలన్నారు. మూటలు మోసే పీసీసీ, సీఎం పదవులను రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారని ఆరోపించారు.