రూ.20 లక్షల బీసీ బంధు ప్రకటించాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

రూ.20 లక్షల బీసీ బంధు ప్రకటించాలి :  రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
  •     రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షల బీసీ బంధు ప్రకటించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్‌‌‌‌‌‌‌‌లోని బీసీ భవన్‌‌‌‌‌‌‌‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కులవృత్తులు దెబ్బతిని బీసీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు గడిచినా ఒక్క బీసీ కుటుంబానికైనా సబ్సిడీ రుణాలు అందకపోవడం బాధాకరమన్నారు. 

బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.20 వేల కోట్ల బడ్జెట్, ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే 12 బీసీ కుల ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉంటే తాను ప్రధానిని కలిసి సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేశ్, రాజేందర్, అనంతయ్య, పగిళ్ల సతీశ్, మోడీ రాందేవ్, బాలయ్య, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.