టైటిల్ : రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ (బయోపిక్)
డైరెక్షన్ : ఆర్. మాధవన్, కాస్టింగ్ : ఆర్. మాధవన్, సిమ్రాన్, సూర్య, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషల్, లాంగ్వేజ్ : తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
రన్‌టైం : రెండున్నర గంటలు
నంబి నారాయణన్ (మాధవన్) ఏరో స్పేస్ సైంటిస్ట్. ఆయన్ని అరెస్ట్ చేసే సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్లో సినీ యాక్టర్ సూర్యతో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆయన లైఫ్ గురించి చెప్తుంటాడు నంబి. మొదటి నుంచే కథలోకి తీసుకెళ్లడంతో ఆడియెన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. నంబి నారాయణన్ గురించి చెప్పాలంటే రాకెట్ సైన్స్ గురించి చెప్పాల్సిందే. కాబట్టి ఈ సినిమాలో రాకెట్ సైన్స్‌కు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. అవి సగటు ప్రేక్షకుడికి అర్థం కావు. కానీ... ఈ సినిమాకి అవి అవసరమే. వాటివల్ల ఆడియెన్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగదు. అంతరిక్ష పరిశోధనలో మన దేశ గొప్పతనాన్ని చూపించడానికి నంబి నారాయణన్ పడిన కష్టం చూపించారు ఈ సినిమాలో.
కానీ... అంత కష్టపడినా ఆయనకు అందుకు తగ్గ ఫలితం రాలేదు. పైగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారాయన. ఆ టైంలో ఆయన, తన కుటుంబం ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసిందో, అప్పుడు వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూపించారు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, డైలాగ్స్‌తో ఆడియెన్స్‌ని కట్టిపడేస్తుంది. నంబి నారాయణన్‌గా మాధవన్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పడిన కష్టం స్క్రీన్ మీద తెలుస్తుంది. ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గానే కాకుండా మొదటిసారి డైరెక్టర్‌గా కూడా మాధవన్ సక్సెస్ అయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. చివరిగా.. ఒక బాధ్యత గల వ్యక్తి బార్డర్లోనే కాదు.. ఏ విభాగంలో ఉన్నా తన దేశభక్తిని చాటుకోవడానికి తపన పడతాడని చూపించిన సినిమా ఇది.
