
- ఒక్క కాళేశ్వరంలోనే లక్ష కోట్ల అవినీతి.. ధరణి, మిషన్ భగీరథ సహా అన్నిట్లో దోపిడీనే
- రాజుగా, తెలంగాణ తన జాగీర్గా ఫీలైతున్నడు
- తెలంగాణ ప్రజల కలలను నాశనం చేసిండు
- కర్నాటక ఫలితాలే ఇక్కడా రిపీట్ అయితయ్
- బీఆర్ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ సమితి
- పేదలకు అండగా పాదయాత్ర చేసిన
- భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు
- అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు
- రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటన
- ఖమ్మంలో ధూంధాంగా ‘తెలంగాణ జనగర్జన’ సభ
- కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం/ఖమ్మం రూరల్/హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని అన్ని రంగాలను, అందరినీ కేసీఆర్ దోచుకుంటున్నారని, అత్యంత అవినీతి పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ అవినీతి కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి తీరుతామని అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలన నాశనం చేసింది. తనకు తాను కేసీఆర్ రాజుగా ఫీలైతున్నడు. తెలంగాణ తన జాగీర్గా భావిస్తున్నడు. ఒక్క కాళేశ్వరంలోనే లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డడు. ఇందిరమ్మ ఇచ్చిన పేదల భూములు గుంజుకుంటున్నడు. ధరణి, మిషన్ భగీరథ.. ఇట్ల అన్నిట్లో దోపిడీకి తెగబడ్తున్నడు’’ అని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ధరణి పేరిట భూములను కేసీఆర్ ఏ విధంగా దోచుకుంటున్నారో భారత్ జోడో యాత్రలో పేదలు తన దృష్టికి తెచ్చారని ఆయన గుర్తుచేశారు.
ఈ భూములు ముఖ్యమంత్రివి కావు. పేదలవి. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు అవి. పేదల భూములు గుంజుకుంటే ఊరుకోబోం” అని హెచ్చరించారు. అవినీతిలో దేశంలోనే కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారని దుయ్యబట్టారు. ‘‘కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ ఎంత దోచుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. రైతులు, దళితులు, పేదలు, గిరిజనులు, ఆదివాసీలు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ దోచుకుంటున్నడు” అని ఆరోపించారు.
బీజేపీకి బీ టీమ్
బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘‘పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నది. బీజేపీ తీసుకువచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ సపోర్టు చేసింది. రైతులకు వ్యతిరేకమైన అగ్రిచట్టాలకు కూడా మద్దతిచ్చింది. అందుకే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నరు. కేసీఆర్ రిమోట్ మోదీ చేతిలో ఉంది” అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ (బంధువుల) సమితి అని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన ప్రతిపక్ష పార్టీల మీటింగ్‌కు బీఆర్ఎస్ను పిలవకపోవడానికి కారణం.. ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ అనే అని రాహుల్ చెప్పారు. ‘‘మీటింగ్‌కు బీఆర్ఎస్ను కూడా పిలవాలని మిగతా ప్రతిపక్ష పార్టీలు అడిగితే మేం ఒప్పుకోలేదు. బీఆర్ఎస్తో వేదికను మేం పంచుకోబోమని ఖరాకండిగా చెప్పాం. బీఆర్ఎస్ వస్తే.. మేం వెళ్లిపోతామన్నం. బీజేపీకి బీ టీమ్ కాబట్టే ఆ పార్టీని రానియ్యలేదు” అని పేర్కొన్నారు.
కర్నాటక ఫలితాలే ఇక్కడ
ఇటీవల కర్నాటక ఎన్నికల్లో అక్కడి అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి, కాంగ్రెస్ విజయం సాధించిందని రాహుల్ అన్నారు. ‘‘కర్నాటకలో ఒక వైపు బీజేపీ, ధనవంతులు ఉంటే.. మరోవైపు రైతులు, కూలీలు, దళితులు అందరూ నిలబడ్డరు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ వెంట నడిచారు. బీజేపీ సర్కార్‌ను ఇంటికి పంపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. కర్నాటకలో బీజేపీని ఓడించినట్లే.. ఇక్కడ బీజేపీ బీ టీమ్‌ను ఇంటికి పంపుతాం. కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన కాంట్రాక్టర్లు ఒక వైపు.. దళితులు, ఆదివాసీలు, పేదలు, రైతులు అంతా మరో వైపు నిలబడ్తరు. కర్నాటక ఎన్నికల్లో ఏం జరిగిందో అదే తెలంగాణలో కూడా జరుగుతుంది” అని చెప్పారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఎలాంటి ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు.
కేసీఆర్ అవినీతి మోదీకి తెలుసు
కేసీఆర్ అవినీతి అంతా ప్రధాని మోదీకి తెలుసని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘‘మోదీ దీవెనలు ఉండటంతోనే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నడు. కేసీఆర్ చేసే స్కాములన్నీ మోదీకి తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎలాంటి అవినీతి జరిగిందో అన్ని ఏజెన్సీలకు తెలుసు.. కానీ చర్యలు ఉండవు.. బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ కాబట్టే ఇదంతా నడుస్తున్నది. అందుకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నరు” అని విమర్శించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ పని అని, దేశ ప్రజలకు ప్రేమను పంచడం తమ పార్టీ పని అని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర తరువాత మళ్లీ తెలంగాణకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వేల కిలో మీటర్లు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి పేదలకు అండగా ఉన్నామనే సందేశాన్ని భట్టి విక్రమార్క చాటిచెప్పారని, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో చూపిన శక్తినే తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు చూపాలని, అవినీతి సర్కార్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అడ్రస్ గల్లంతైంది
‘‘ఇన్నాళ్లూ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ అని చెప్పేవాళ్లు. కానీ, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఖతమైంది. కారు నడుస్తుంటే నాలుగు టైర్లు పంచర్ అయినట్టుగా దాని అడ్రస్గల్లంతైంది” అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ‘‘నేను మీ ఆందరికీ చెపుతున్నా, మీకోసం మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొందరు గతంలో కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. వాళ్లంతా పార్టీలోకి తిరిగి రావాలని కోరుతున్న. కాంగ్రెస్ ఆలోచనలు, విధానాలు నచ్చినవాళ్లు ఎప్పుడైనా పార్టీలోకి రావొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ భావజాలం ఉన్నవాళ్లకు మాత్రం మా దగ్గర చోటు లేదు” అని అన్నారు.
వృద్ధులు, వితంతువులకు ‘చేయూత’
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘చేయూత’ పథకాన్ని తీసుకువస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ‘‘వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించాం. హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించాం. ఇప్పుడు మరో చరిత్రాత్మక ముందడుగు వేయబోతున్నం. వృద్ధులు, వితంతువుల కోసం ‘చేయూత’ పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇస్తున్న. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ. 4వేల పెన్షన్ ఇస్తం” అని వెల్లడించారు. అధికారంలోకి వస్తే ఆదివాసీలకు పోడు భూములను పంచుతామని ప్రకటించారు.
రాహుల్‌కు ముద్దుపెట్టిన గద్దర్
ఖమ్మం సభ వేదికపై రాహుల్ గాంధీకి ప్రజా గాయకుడు గద్దర్ ముద్దు పెట్టారు. ముందుగా రాహుల్ గాంధీకి గద్దర్‌ను రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌తో మాట్లాడిన గద్దర్.. ఆప్యాయంగా హత్తుకొని ముద్దుపెట్టారు. కాగా, 17 జిల్లాల్లో 109 రోజుల పాటు 1,360 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించారు. భట్టికి చందనపు దండ వేసి అభినందనలు తెలిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ ఖిల్లా: ఉత్తమ్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. కాగా, రాహుల్ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి ఉత్తమ్ ట్రాన్స్‌లేట్ చేశారు.
బీఆర్ఎస్ను అండమాన్‌కు తరమాలి: రేవంత్
అరవయ్యేండ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని, అమరుల త్యాగాన్ని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, అలాంటి రాష్ట్రాన్ని అనకొండ లాగా కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని అండమాన్ వరకు తరిమికొట్టే బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉందని చెప్పారు. ఖమ్మం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ ఎస్ సన్నాసులు, సైకోలు ఈ జిల్లాలో ఉండే మంత్రి కాంగ్రెస్ మీటింగ్ కు బస్సులు ఇవ్వలేదు.. లారీలు రానియ్యలేదు.. వెహికల్స్‌ను మీటింగ్ కు రాకుండా అడ్డుకున్నరు. అయినా భారీగా జనం వచ్చారు” అని తెలిపారు. ‘‘డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే.
అదే రోజు రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను ఆమె చేశారు. ఇప్పుడు అదే రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే మాటను రాహుల్‌గాంధీకి ఇస్తున్న” అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖమ్మంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల శంఖారావానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మీటింగే నాంది అని తెలిపారు. ‘‘వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినం. ఇప్పుడు రూ. 4 వేల పెన్షన్ ప్రకటించినం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిలే ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తం” అని రేవంత్ చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తామని, రాష్ట్రంలో 80 సీట్లు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 109 రోజులు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలను భట్టి విక్రమార్క కలిశారని, ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని చేర్చుతామని రేవంత్ ప్రకటించారు.
తెలంగాణ ప్రజల మార్చ్ ఇది: భట్టి విక్రమార్క
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్రకు కొనసాగింపే తన పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర చేసిన. సింగరేణి కార్మికులు , కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను, రోడ్ల మీద వడ్లు ఆరబోసిన రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న. అధికార మదంతో, రాష్ట్ర సంపద ను దోచుకున్న ఈ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా యాత్ర చేసిన. తెలంగాణ ప్రజలు చేసిన మార్చ్ నా పాదయాత్ర” అని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గొండుల సమస్యలు తెలుసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములు ఇస్తే ఈ ప్రభుత్వం లాక్కుంటుందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆదివాసీలు కోరుకుంటున్నారని తెలిపారు. ధరణి మహమ్మారిని తీసుకొచ్చి గోస పెడ్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ‘‘ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఆత్మగౌరవం ఎక్కడుంది? అధికార మదంతో కేసీఆర్ పనిచేస్తున్నరు. రాష్ట్రాన్ని రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ర్టంగా మార్చిన్రు” అని మండిపడ్డారు. 24 లక్షల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచితే... దళితులకు 3 ఎకరాలు ఇస్తామని కేసీఆర్ చెప్పి ఉన్న భూములను లాక్కుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సంపద ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని అన్నారు.
మొదటి సంతకం పెన్షన్ పైనే: కోమటిరెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం పెన్షన్ ఇచ్చే ఫైల్ మీదే పెడతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. “మొన్ననే కేటీఆర్ చెప్పిండు..రూ.200 పెన్షన్ ఇచ్చే వాళ్లు కావాల్నా...రూ.2వేలు ఇచ్చే బీఆర్ ఎస్ కావాల్నా అని అన్నడు. కేటీఆర్.. ఇగ చూసుకో. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్‌పైనే మొదటి సంతకం ఉంటది” అని తెలిపారు. దేశాన్ని, జాతిని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని అన్నారు.