- ప్రజలు జవాబుదారీ తనాన్ని డిమాండ్ చేయాలి
- నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత ట్వీట్
న్యూఢిల్లీ: దేశమంతా దురాశ వ్యాపించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అస్తవ్యస్తమవుతున్న పట్టణాలు దాని భయానక రూపమని తెలిపారు. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ పెట్టారు. ఢిల్లీలోని ముబారక్ పూర్ దాబాస్ లో శర్మ ఎన్ క్లేవ్ లో మురుగునీరు పొంగిపొర్లిన ప్రాంతం నుంచి ఓ జర్నలిస్టు రిపోర్టు చేస్తున్న వీడియోను తన ట్వీట్ కు ఆయన జోడించారు.
‘‘ఇయ్యాల ప్రతి భారతీయుడి జీవితం ఈ విధంగానే నరకప్రాయంగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారికి సిస్టమ్ అమ్ముడుపోయింది. ఒకరి భుజం మరొకరు తట్టుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ప్రజలను అణచివేస్తారు. దేశంలో దురాశ వ్యాపించింది. అస్తవ్యస్తమవుతున్న పట్టణాలు దాని భయానక రూపం. మనం వాటిని మౌనంగా, ఉదాసీనంగా ఆహ్వానించాం కాబట్టే మన సమాజం చనిపోతున్నది.
ప్రజలు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలి. లేనిపక్షంలో ప్రతి భారతీయుడి జీవితం ఈ విధంగానే నరకప్రాయంగా మారుతుంది” అని పేర్కొన్నారు. నోయిడాలో యువరాజ్ మెహతా (27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఇటీవల మరణించారు. భవన నిర్మాణం కోసం తవ్విన నీటి గుంతలో ఆయన కారు పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
హర్యానాకు రాహుల్ గాంధీ.. డీసీసీ చీఫ్‌లను ఉద్దేశించి ప్రసంగం
హర్యానా, ఉత్తరాఖండ్ లకు చెందిన కాంగ్రెస్ డిస్ట్రిక్ యూనిట్స్ ప్రెసిడెంట్స్ ట్రైనింగ్ క్యాంప్ ను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ ట్రైనింగ్ క్యాంప్ కురుక్షేత్రలో జరుగుతున్నది. ఈ క్రమంలోనే బధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పార్టీ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణ్ దీప్ సుర్జేవాలా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ రావు నరేందర్ సింగ్, బీకే హరిప్రసాద్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
