మాట ఇచ్చామంటే అమలు చేసి తీరుతం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మాట ఇచ్చామంటే అమలు చేసి తీరుతం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • కులగణన సంప్రదింపుల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • రాహుల్ ప్రకటనను అభినందిస్తున్నమని ఆర్ కృష్ణయ్య, కంచె ఐలయ్య, సూరెపల్లి సూజాత,శాంతా సిన్హా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాహుల్ మాట ఇస్తే.. అమలు చేసి తీరుతారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కుల గణన సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించిన మహేశ్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో చేపడుతున్న కుల గణన సర్వే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్నికల ముందు కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు, ఇప్పడది అమలు చేసి చూపిస్తున్నారని తెలిపారు. 

భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక మంది మేధావులు, కుల సంఘాల వారు, సామాజిక కార్యకర్తలను రాహుల్ కలిశారని, వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే కుల గణన చేపడుతామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ అన్ని సంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల వారు పాల్గొన్న ఈ సమవేశానికి రాహుల్ వచ్చారని, ఇందులో పాల్గొన్న అందరి అభిప్రాయాలను రాహుల్ స్వీకరించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. కుల గణన ఎక్స్‌‌‌‌రే వంటిదని, ఆ పనిని తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాన్నిఅభినందిస్తున్నా: ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం నిజంగా అభినందించదగ్గ విషయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కుల గణన సంప్రదింపుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కూడా దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని ప్రకటించడం ఎంతో ధైర్యంతో కూడుకున్నదని, ఇలాంటి లీడర్ దేశంలో ఉండడం బీసీలకు, ఇతర అణగారిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు.

 ఈ సమావేశంలో పాల్గొన్న దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు కంచె  ఐలయ్య, సూరెపల్లి సుజాత, శాంతా సిన్హా మాట్లాడుతూ కుల గణన జరపడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయమని, ఇలాంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించక తప్పదన్నారు. దేశంలో కూడా దీన్ని అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

రాహుల్ కు ఘన స్వాగతం

రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం 5.30 నిమిషాలకు రాహుల్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయంలో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బోయనిపల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు చేరుకున్న సందర్భంలో అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పోడవునా ప్రధాన రాహదారికి ఇరువైపుల పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నిలబడి స్వాగతం పలికారు.

 ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీ మొత్తం రాహుల్‌‌‌‌ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు దర్శనమిచ్చాయి. భావి ప్రధాని రాహుల్ అంటూ ఆయనకు స్వాగతం పలికారు. సుమారు గంటన్నరకు పైగా సమావేశంలో గడిపిన రాహుల్ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొన్నం, సురేఖ, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.