- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఖాజీపూర్‌లో ఏప్రిల్ 27న ఘటన
మద్దూరు, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో గత నెల 27న జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. అప్పు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో తోడల్లుడే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు. మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన హైమద్ అలియాస్ అహ్మద్ (42) ఓ ఆటో మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇదే మండలంలోని రేణివట్లకు చెందిన మహమ్మద్ ఖాజా, హైమద్ తోడల్లుండ్లు. ఇటీవల తనకు రూ. 5 లక్షలు అప్పుగా ఇవ్వాలని ఖాజా అడగడంతో హైమద్ తిరస్కరించాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కక్ష పెంచుకున్న ఖాజా.. హైమద్‌ను చంపేస్తే ఆస్తితో పాటు అతడి భార్యను సైతం లోబరుచుకోవచ్చని ప్లాన్ చేశాడు. హైమద్ గత నెల 27న ఖాజీపూర్ శివారులోని తన కోళ్లఫామ్ వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఖాజా రూ. 5 లక్షలు ఇవ్వాలని మరోసారి అడుగగా.. హైమద్ తిరస్కరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఖాజా బండరాయితో కొట్టడంతో హైమద్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత ఖాజా అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఖాజాను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ వెల్లడించారు.
