ఉప్పల్, వెలుగు: ఉప్పల్ నల్లచెరువు కట్ట సమీపంలోని ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ వర్షాల కారణంగా పూర్తిగా బురదమయమై, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్-–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో జిల్లాల బస్సులను ఇక్కడికి మార్చగా, స్వల్ప వర్షానికే ప్రాంగణమంతా బురదగా మారుతోంది. వరంగల్, జనగాం, తొర్రూరు, యాదాద్రి వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు బురదలోనే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
మంగళవారం తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోగా, డ్రైవర్లు, ప్రయాణికులు కలిసి జేసీబీ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. బస్సులు దిగబడుతుండటంతో సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం దృష్ట్యా వెంటనే బురదను తొలగించి, కంకర లేదా పేవర్ బ్లాకులు వేసి కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
