న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని జంతర్మంతర్వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి, అయోధ్య రామ మందిరంలో ‘చందాల చోరీ’ని నిరసిస్తూ.. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. 12వ రోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు.. మకర ద్వారం ఎదురుగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో ప్రియాంక గాంధీతో పాటు ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, మనోజ్ ఝా, ఆర్ ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమచంద్రన్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘
అమిత్ షా పార్లమెంట్ నుంచి ఎందుకు గయాబ్ అయ్యారు? ’ అని ప్రశ్నిస్తూ భారీ ప్లెక్సీతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. మరోవైపు, అయోధ్య చందా చోరీ ప్రధాన అంశంగా సమాజ్ వాది పార్టీ ఎంపీలు మెడలో కండువాలు వేసుకొని.. రాముడి హుండీతో నిరసన తెలిపారు. డీఎంకే పార్టీ ఎంపీలు మకర ద్వారం ప్రధాన మార్గంపై నిలబడి ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చందా చోర్ –గద్ది చోడ్, రాముడి చందా– బీజేపీ పార్టీకి చేరింది, చందా చోర్ బీజేపీ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా రాముడి హుండీ పేరుతో రాసి ఉన్న బాక్స్ లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎస్పీ ఎంపీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఇతర ఎంపీలు డబ్బులు వేసి నిరసన తెలిపారు.
