టెన్త్ స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు వాట్సాప్, మెయిల్ కే!..పోస్టల్ ద్వారా పంపించే పాత పద్ధతికి చెక్ 

టెన్త్ స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు వాట్సాప్, మెయిల్ కే!..పోస్టల్ ద్వారా పంపించే పాత పద్ధతికి చెక్ 

హైదరాబాద్, వెలుగు:  ఇక టెన్త్​ స్టూడెంట్ల వాట్సాప్​కే ఆన్సర్​షీట్లు అందనున్నాయి. రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం గుడ్​ న్యూస్​ చెప్పింది. పాత పద్ధతిలో పోస్టల్​ద్వారా జిరాక్స్ కాపీలను పంపే కష్టాలకు చెక్​పెట్టింది. డైరెక్ట్​గా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఆన్సర్ షీట్లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే విద్యార్థులు రాసిన పేపర్లను వెదికి, జిరాక్స్ తీసి, వాటిని పోస్ట్ ద్వారా పంపించేవారు. సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ వచ్చినా కూడా చాలా మందికి ఈ పేపర్లు అందేవి కావు. ఈ ఆలస్యాన్ని ఆపేందుకే తొలిసారిగా ‘డిజిటల్ వాల్యుయేషన్’ (రీ కౌంటింగ్) ​నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

స్టూడెంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న వాట్సాప్​, మెయిల్​కే పేపర్​ను పంపించనున్నారు. దీంతో టైమ్ సేవ్ కావడంతో పాటు సర్కార్‌కు కూడా ఖర్చు ఆదా కానుంది. ఈ కొత్త సిస్టమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 20 స్పాట్ సెంటర్లను అధికారులు సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లోనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పని పూర్తి చేసి వెంటనే డిజిటల్ కాపీలను విద్యార్థులకు పంపిస్తారు. ఈ నెల 30 నుంచి మే 14 వరకూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. పరీక్షల విభాగంలో తొలిసారిగా ఇలాంటి కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంపై విద్యార్థులు, పేరెంట్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.