- అభివృద్ధి పనులపై ఎఫెక్ట్
- ఈఈలకు ఇన్చార్జి ఎస్ఈ బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ఇంజినీర్ల కొరత ఏర్పడింది. ఇంజినీర్లలో చీఫ్ ఇంజినీర్లు(సీఈ) పూర్తిగా కార్పొరేషన్లలోని అన్ని రకాల ఇంజినీరింగ్ విభాగాలకు హెడ్ గా కొనసాగుతున్నారు. అలాగే సూపరింటెండెంట్ ఇంజినీర్లు(ఎస్ఈ)జోన్ కి ఒకరి చొప్పున ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి జోన్ వరకు పనులకు అనుమతులు ఇవ్వడంతో పాటు పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ)లు సర్కిల్ వారీగా జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. వీరికింద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ)లు, అసిస్టెంట్ ఇంజినీర్లు(ఏఈ)లు వార్డు స్థాయిలో పనులను సూపర్వైజ్చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరూ రిటైర్అవుతుండడం, కొత్తవారు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది.
మరికొందరు రెడీ
ట్రై కార్పొరేషన్ల విభజనకి ముందు కొందరు పదవీ విరమణ పొందారు. ఇప్పుడు మూడు కార్పొరేషన్లకి సంబంధించి ఇన్చార్జీ చీఫ్ ఇంజినీర్లుగా కొనసాగుతున్న ముగ్గురు ఎస్ఈల్లో ఒకరు ఈ నెల, మరొకరు జూన్ లో రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మరొకరు కూడా పదవీ విరమణ చేయనున్నారు. ఇలా కీలకమైన పోస్టుల్లో ఉన్నవారు రిటైర్అవుతుండడంతో అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం ముడుచోట్లా రెగ్యులర్ సీఈలు లేరు. ట్రై కార్పొరేషన్లలో కలిపి 8 మంది ఎస్ఈలున్నారు.
ఇందులో ముగ్గురు ఇన్చార్జీ సీఈలుగా కొనసాగుతుండగా, మిగతావారు ఇతర విభాగాల్లో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ)లు 45 మంది ఉండగా, ఇందులోనూ ఏడు నుంచి ఎనిమిది మంది ఇన్చార్జి ఎస్ఈలుగా కొనసాగుతున్నారు. మిగతా ఈఈల్లోనూ కొందరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అలాగే డీఈఈలుగా ఏఈలు కొనసాగుతున్నారు. ఇలా డీఈఈ, ఏఈలు కలిపి దాదాపు 180 మంది ఉన్నారు.
హెచ్ సిటీ పనులపై ప్రభావం పడే ఛాన్స్....
ఇంజినీర్ల కొరత హెచ్ సిటీ పనులపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కేబీఆర్ పార్కు వద్ద పనులు స్పీడందుకున్నాయి. వీటిలో పాటు పలు ఫ్లైఓవర్లకి సంబంధించి పనులు నిర్మాణ దశలో ఉండగా, ఇంకొన్ని టెండర్లెవెల్లో , మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇటువంటి టైంలో అనుభవమున్న సీనియర్లు రిటైర్అయితే, కొత్తగా వచ్చే వాళ్లకు పనుల మీద గ్రిప్ దొరకడం కష్టమని, దీనివల్ల డెవలప్‌మెంట్ పనుల మీద ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఇంజినీర్ల కొరత వేధిస్తుండడంతో, కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టుల బాధ్యతలను ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకే అప్పగించారు. పనులు ఆగకుండా ఎవరో ఒకరు ఇన్-చార్జ్‌గా ఉండాల్సిందే అన్నట్టుగా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.
