హైదరాబాద్​లో రాహుల్ గాంధీ​ మకాం!

హైదరాబాద్​లో రాహుల్ గాంధీ​ మకాం!

హైదరాబాద్​, వెలుగు:కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​గాంధీ తన నివాసాన్ని హైదరాబాద్​కు మార్చుకుంటున్నరా..?! ఔను..  త్వరలోనే ఆయన ఇక్కడికి షిఫ్ట్​ అవుతారనే ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్​ నుంచే జాతీయ రాజకీయాలు నిర్వహించే ఆలోచనలో రాహుల్​ ఉన్నారట. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్​ కేంద్ర బిందువు. అనువైన వాతావరణంతోపాటు అన్ని వసతులుండటంతో దక్షిణాది విడిదిగా ఇక్కడే మకాం ఏర్పాటు చేసుకోవాలని  రాహుల్ ఫ్యూచర్​ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. తనతో పాటు తన తల్లి సోనియాగాంధీ కూడా కొంతకాలం  ఇక్కడే ఉండేందుకు వీలుగా  రాహుల్​ అన్ని సదుపాయాలున్న ఇంటిని అన్వేషించే పనిలో పడ్డట్లు సమాచారం. సెక్యూరిటీ యాంగిల్​లోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్​ ముఖ్య నేతలతో రాహుల్​ తన ఆలోచనను పంచుకున్నట్లు తెలిసింది. 

ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్న రెసిడెన్స్ చూసుకోవాలా..? సరైన స్థలం ఎంచుకొని అన్ని హంగులతో కొత్త భవనం కట్టుకోవాలా..? అనే ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్​లో కీ రోల్​లో ఉన్న లీడర్ ఇప్పటికే  రాహుల్​కు ఇంటిని వెతికి పెట్టే పనిలో ఉన్నారని ఆ లీడర్​ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నెలలోనే హైదరాబాద్​లో జరిగే  సీడబ్ల్యూసీ సమావేశాలకు సోనియాతో పాటు రాహుల్​ హాజరు కానున్నారు. అదే సందర్భంగా బోయినపల్లిలో రాజీవ్​గాంధీ ఐడియాలజీ సెంటర్ కు  భూమిపూజ చేస్తారు. అక్కడున్న  ఎనిమిది ఎకరాల స్థలంలో మోడర్న్​ గెస్ట్ హౌస్​ నిర్మించే  ప్లాన్ కూడా​ ఉందని కాంగ్రెస్​రాష్ట్ర ముఖ్య నేతలు చెప్తున్నారు. సోనియా, రాహుల్​ నివాసముండేలా ఈ గెస్ట్ హౌస్​ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అయితే.. అక్కడే రాహుల్​ రెసిడెన్సీ ఉంటుందా..? మరోచోట వెతికి పెడుతారా..? అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.