V6 News

డిసెంబర్ ఒకటిన కర్నాటకకు కొత్త సీఎం రాబోతున్నారా..?

డిసెంబర్ ఒకటిన కర్నాటకకు కొత్త సీఎం రాబోతున్నారా..?

 కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి ఎవరు ఉండాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద  చర్చే నడుస్తోంది. డిసెంబర్ 1న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యేలోపు ముఖ్యమంత్రిని మార్చాలా వద్దా అనే దానిపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమయంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాహుల్ గాంధీతో మాట్లాడాలని వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా దీనికి రాహుల్ గాంధీ "ప్లీజ్ వేట్.. నేను మీకు కాల్ చేస్తాను” అంటూ వాట్సాప్ మెసేజ్ పంపారు. ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చలు జరుగుతున్నప్పుడే ఈ మెసేజ్ వచ్చింది.

శివకుమార్ కూడా నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అదే రోజు ఢిల్లీకి తిరిగి వస్తున్న సోనియా గాంధీని కలవడానికి ఆయన అపాయింట్‌మెంట్ కూడా అడిగినట్లు తెలుస్తోంది.

ALSO READ : ఒక్కో భజన మండలికి రూ. 25 వేలు

రాహుల్ గాంధీ ఢిల్లీలో కర్ణాటకకు చెందిన నేతలు ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చెగౌడలతో   సమావేశమైనట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో ఓటు చోరీ, కొత్తగా తెచ్చిన KEO AI PC డివైజ్, కర్ణాటకలోని మొత్తం రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడారు. అలాగే, ఆలంద్‌లో జరిగిన ఓట్ చోటి గురించి రాహుల్ గాంధీ అడిగారు. మొదట 15 నిమిషాలు ఉమ్మడిగా  సమావేశం జరగ్గా.. ఆ తర్వాత, రాహుల్ గాంధీ ప్రియాంక్ ఖర్గేను విడిగా 20 నిమిషాల పాటు మాట్లాడారు.

 
ముఖ్యమంత్రి అధికార పదవి బదిలీ, మంత్రివర్గంలో మార్పులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యల గురించి రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో వివరంగా మాట్లాడినట్లు  సమాచారం.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ఐదేళ్లూ సీఎంగా ఉంటానని, పదవిని పంచుకునే ఒప్పందాన్ని ఒప్పుకోనని బహిరంగంగా చెప్పడంతో రాహుల్ బాధపడినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి.. నేను సిద్ధరామయ్య, శివకుమారుతో మాట్లాడతాను అని రాహుల్ గాంధీ  ప్రియాంక్‌తో చెప్పారని, ఉద్రిక్తత పెంచవద్దు అని సలహా ఇచ్చారని తెలుస్తోంది.

బెంగళూరుకు రాగానే ప్రియాంక్‌కు సీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆయనను ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించారని సమాచారం.

ఆయన సిద్ధరామయ్యకు సమాచారం చెప్పిన తర్వాత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ పరిణామాన్ని పార్టీలోని చాలా మంది శివకుమార్‌కు మంచి సపోర్ట్ లాగ, ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బగా చూస్తున్నారు.

ముఖ్యమంత్రి  మారినా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండాలని రాహుల్ గాంధీ గట్టిగా అనుకుంటున్నారని సమాచారం. అందుకే శివకుమార్ సీఎం అయితే, ముఖ్యమైన సామాజిక వర్గాల (కులాలు) నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటానికి పార్టీ ఒక పద్ధతిని ఆలోచిస్తోంది.

ఈ విధానం ప్రకారం సామాజికంగా, రాజకీయంగా బ్యాలెన్స్ చేయడం కోసం కేపీసీసీ అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం పదవులను OBC, SC/ST, మైనారిటీ వర్గాల నాయకులకు ఇవ్వవచ్చని తెలుస్తోంది.