ఒక్కో భజన మండలికి రూ. 25 వేలు : స్కీం అద్దిరిపోయింది కదా.. ఎక్కడో తెలుసుకోండి...!

ఒక్కో భజన మండలికి రూ. 25 వేలు : స్కీం అద్దిరిపోయింది కదా.. ఎక్కడో తెలుసుకోండి...!

మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అక్కడి భజన మండళ్లకు పెద్ద ఉత్సాహాన్నిచ్చే కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,800 భజన మండళ్లకు మొత్తం రూ.4.5 కోట్లు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద ఒక్కో భజన మండలికి రూ.25 వేల చొప్పున ఒక నెలలోపే అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నిధులను సదరు భజన మండళ్లు హార్మోనియం, మృదంగం, పఖవాజ్‌, వీణ వంటి సంగీత వాయిద్య పరికరాల కొనుగోలుకు వినియోగించుకోవచ్చని సాంస్కృతిక శాఖ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. గ్రామీణ కళా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే భజన సంప్రదాయాలకు ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సాయం కళాకారులకు ఎంతో ఉపశమనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుడు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, ఒక నెలలోపే వాటి యుటిలైజేషన్ సర్టిఫికెట్‌తో పాటు నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు అందుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్స్‌, నగర పంచాయతీల ఎన్నికల కారణంగా అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాన్డక్ట్‌ను ఉల్లంఘించకుండా నిధుల పంపిణీ జరగాలని సూచించారు. 

ALSO READ : కిలో వెండి రూ.6 లక్షలు అవుతుందా.. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కో భజన మండలిలో కనీసం 20 మంది సభ్యులు ఉండాలి. ఆమోదయోగ్యంగా పరిగణించబడేందుకు సంబంధిత సంస్థ కనీసం 50 కార్యక్రమాలు నిర్వహించి ఉండడం తప్పనిసరి. ఈ అర్హతలు పూర్తి చేసిన భజన మండళ్లు రెండుసార్ల వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ నిధి విడుదలతో గ్రామీణ కళాకారుల జీవన విధానంలో ఉత్సాహం కలుగనుంది. ముఖ్యంగా వార్షిక యాత్రలు, దేవాలయోత్సవాలు, సామూహిక భజన కార్యక్రమాల్లో ఈ వాయిద్య పరికరాలు వినియోగం మరింత పెరుగుతుందని కళావర్గాలు చెబుతున్నాయి.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాంప్రదాయ సంగీత కళలకు ఆధునిక శక్తినిచ్చే దిశగా తీసుకున్న అడుగుగా వారు భావిస్తున్నారు.