న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఎలక్షన్ బిల్ అని విమర్శించారు. కొద్దిరోజులుగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఖర్చు పెట్టిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం ద్వారా పేదల నుంచి వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పెద్ద దెబ్బ పడుతుందని హెచ్చరించారు.
ఎన్నికలు ముగియగానే ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తుందని తాను ముందే చెప్పానని రాహుల్ గుర్తుచేశారు. ‘‘ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కరోజులోనే రూ.993 పెరిగింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద పెంపు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.1,380 పెరిగింది. అంటే మూడు నెలల్లోనే గ్యాస్ ధర 81శాతం పెరగింది”అని పేర్కొన్నారు. దీని ప్రభావం చిరువ్యాపారులపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చాయ్ దుకాణాలు, హోటళ్లు, దాబాలు, బేకరీలు, స్వీట్ షాపులపై భారం పెరుగుతుందన్నారు. చివరికి సాధారణ ప్రజల రోజువారీ భోజనంపైకూడా ప్రభావం పడుతుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
- కోట్లాదిమందికి నష్టం:
కేసీ వేణుగోపాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం ధరలను పెంచిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఏకమొత్తంలో వెయ్యి రూపాయల ధర పెంపు చిన్న వ్యాపారులపై, ముఖ్యంగా తక్కువ ధరలతో భోజనం అందించే చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కోట్లాది మంది ప్రజలు నష్టపోతారని తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదని మండిపడ్డారు. తక్కువ ధరలు ఉన్నప్పుడు లాభాలు తీసుకుని, ఇప్పుడు భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు.
