- రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో ప్రమాదం
- గడ్డర్లు జారి పడి పలువురు కూలీలకు గాయాలు
కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో గడ్డర్లను క్రేన్ సాయంతో దించే సమయంలో అవి ఒక్కసారిగా జారి పడ్డాయి. బ్రిడ్జిపై బాక్స్ పనులు చేస్తున్న కూలీలు అందులో ఇరుక్కుపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీ రవి పట్టాల బాక్స్‌లో ఇరుక్కుపోవడంతో సహచరులు కటర్ తో ఇనుప రాడ్లు కోసి అతన్ని బయటకు తీశారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరో కూలీ అక్బర్ సహా ముగ్గురికి గాయాలయ్యాయి. రవికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని రైల్వే జీఆర్పీ అధికారి రమణ కుమార్ పరిశీలించారు. పనుల ప్రదేశంలో కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందడంలో ఆలస్యం జరిగిందని, దీనిపై కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు ఆనంద్ డిమాండ్ చేశారు.
