సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్యాసింజర్లతో పాటు వారి లగేజీని ప్లాట్ ఫాంపైకి తీసుకెళ్లేందుకు కొత్తగా బగ్గీ పేరుతో ఏర్పాటు చేసిన తేజో భారత్ వెహికల్స్‌ను రైల్వే డివిజనల్ మేనేజర్ అభయ్ గుప్తా శుక్రవారం ప్రారంభించారు. మొత్తం 3 వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చామని, ఒకటి, పదో నంబర్ ప్లాట్ ఫాంలో ఇవి ఉంటాయన్నారు. వీటి సేవలను వాడుకునే ఒక్కో ప్యాసింజర్ రూ.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ వెహికల్స్ ప్యాసింజర్లతో పాటు 40 కిలోలకు మించకుండా లగేజీని ఒకటి, పదో ప్లాట్ ఫాం వరకు, అక్కడ రైలు దిగిన వారిని మెయిన్ గేట్ వరకు తీసుకెళ్తాయన్నారు. ప్యాసింజర్ల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను చూసి మరిన్ని వెహికల్స్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. వృద్ధులు, మహిళలు, గర్భిణిలకు బగ్గీ వెహికల్స్ ఎంతో ఉపయోగపడతాయని అభయ్ గుప్తా తెలిపారు.

