యాదగిరి గుట్ట–కాజీపేట మధ్య...3, 4వ లైన్ల ప్రాజెక్టు కాంపిటెంట్ అథారిటీల నియామకం

యాదగిరి గుట్ట–కాజీపేట మధ్య...3, 4వ లైన్ల ప్రాజెక్టు కాంపిటెంట్ అథారిటీల నియామకం

న్యూఢిల్లీ, వెలుగు: యాదగిరి గుట్ట– కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల ప్రాజెక్టును పర్యవేక్షించడానికి కేంద్ర రైల్వే శాఖ కాంపిటెంట్ అథారిటీ ని నియమించింది. జనగామ జిల్లా పరిధిలో వచ్చే జనగామ, ఘన్‌‌‌‌పూర్ డివిజన్లకు సంబంధించి ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులను (ఆర్డీవో) కాంపిటెంట్ అథారిటీలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. యాదగిరిగుట్ట– కాజీపేట మధ్య మొత్తం 77.96 కి.మీల పొడవునా మూడో, నాలుగో రైల్వే లైన్ల పనులకు రైల్వే శాఖ గతంలోనే ఆమోద ముద్రవేసింది. 

ఇందులోనే ఘట్‌‌‌‌కేసర్-–యాదగిరి గుట్ట మధ్య 32.45 కి.మీల మేర 4వ లైన్‌‌‌‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 2 (7ఏ) కింద... ఈ ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు అమలు, నిర్వహణ, యాజమాన్య వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తాజాగా అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ అధికారికంగా ప్రచురితమైన తేదీ నుంచే ఆర్డీవోలు ఈ బాధ్యతల స్వీకరణ పరిగణలోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్-2) మోతీలాల్ భూక్యా ఈ నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నారు. ఈ డబ్లింగ్, క్వాడ్రప్లింగ్ పనుల వల్ల భవిష్యత్తులో సికింద్రాబాద్-–విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు, రైల్వే ద్వారా సరుకు రవాణ మరింత మెరుగుపడుతుందని వెల్లడించింది.