తెలంగాణలో వారం రోజులు వానలు..రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్

తెలంగాణలో వారం రోజులు వానలు..రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్
  • రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్​.. 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ 
  • తగ్గుతున్న టెంపరేచర్లు.. 
  • 4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకుపైగా నమోదు
  • మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే రికార్డ్ 
  • అత్యల్పంగా హైదరాబాద్​లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంటీరియర్ కర్నాటక మీద నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతున్నదని.. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపు రికార్డ్ అవుతాయని తెలిపింది. అలాగే రుతుపవనాలు మరింత అడ్వాన్స్​ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
  
ఉత్తర జిల్లాల్లో ఎండ.. దక్షిణ జిల్లాల్లో వానలు 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఉండగా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదవుతుండగా.. దక్షిణాదిన అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే రికార్డవుతున్నాయి. ఆదివారం జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లా ఐజలో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజోలిలో 4.96 సెటీమీటర్లు, నారాయణపేట జిల్లా మక్తల్​లో 4.6, నర్వలో 4.1, రంగారెడ్డి జిల్లా నందిగామలో 3.2, వికారాబాద్ జిల్లా మాడ్గూల్ చిట్టెంపల్లిలో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.  హైదరాబాద్ సిటీలోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. గచ్చిబౌలిలో 2.3, చందానగర్​లో 1.8, హెచ్​సీయూ వద్ద 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్, ముషీరాబాద్, కూకట్​పల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.  

టెంపరేచర్లు తగ్గినయ్ 

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. కేవలం నాలుగు జిల్లాల్లోనే 40 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా అలీపూర్​లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయింది. ఖమ్మం జిల్లాలో 40.2, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 40.1, నిర్మల్ జిల్లాలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 40 లోపే రికార్డ్​ అయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ నాగోల్​లో 37.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గోల్కొండ కోట వద్ద 37.5, శంకర్ పల్లిలో 37.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.