ఇవాళ్టి నుంచి( మే 5) నాలుగు రోజులు ఈదురుగాలులు, వానలు

ఇవాళ్టి నుంచి( మే 5) నాలుగు రోజులు ఈదురుగాలులు, వానలు
  • పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం
  • ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు
  • నిజామాబాద్, నిర్మల్​లో 45 డిగ్రీలపైనే టెంపరేచర్లు​
  • పలు జిల్లాల్లో అకాల వర్షం.. రైతన్న ఆగం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం, మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆ తర్వాతి 2 రోజులకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ4 రోజుల పాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.

ఉత్తర తెలంగాణలో ఎండ మంట

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదివారం ఎండలు మండిపోయాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అదే టైమ్​లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కొంచెం తక్కువగా ఉన్నది. నిర్మల్​ జిల్లాలో 45.2 డిగ్రీలు, జగిత్యాలలో 45, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 44.7, పెద్దపల్లిలో 44.5, కరీంనగర్​లో 44.3, రాజన్నసిరిసిల్లలో 43.7, మంచిర్యాలలో 43.6, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మాత్రమే ఆ స్థాయిలో టెంపరేచర్ ఉన్నది. 

నల్గొండ జిల్లాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు పలు జిల్లాల్లో వర్షం పడింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కొండపాకలో 4.6, మిరుదొడ్డిలో 4.3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండదలపల్లి, నాగులపల్లిల్లో 2.6, సిద్దిపేటలో 2.4, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 2.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.