యాదాద్రిలో మునిగిన పార్కింగ్​ ప్లేస్​..ఎండకొట్టినా, వానొచ్చినా భక్తులకు తప్పని అవస్థలు

యాదాద్రిలో మునిగిన పార్కింగ్​ ప్లేస్​..ఎండకొట్టినా, వానొచ్చినా భక్తులకు తప్పని అవస్థలు

యాదగిరిగుట్ట, వెలుగు: లక్ష్మినరసింహ స్వామి క్షేత్రం యాదగిరిగుట్టలో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. రెండు గంటలపాటు కుండపోతగా కురిసిన వర్షానికి ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వర్షం ధాటికి కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచి చెరువును తలపించింది. పార్కింగ్ నుంచి వాననీళ్లు బయటకు పోయే మార్గం లేకపోవడంతో.. భక్తుల వాహనాలు నీటమునిగాయి. దీంతో భక్తులు అనేక పాట్లు పడాల్సి వచ్చింది. ఇక స్వామివారి దర్శనానికి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులకు ఎండొచ్చినా, వానొచ్చినా తిప్పలు తప్పడం లేదు. 

నిన్నటివరకు కొండపై మండుటెండలకు నిలువనీడ లేక అవస్థలుపడ్డ భక్తులు.. గురువారం కురిసిన భారీ వర్షానికి ఆగమాగం అయ్యారు. కొండపైన ఎండకు, వానకు తలదాచుకోవడానికి ఏర్పాట్లు లేకపోవడంతో.. భక్తులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గురువారం కురిసిన వర్షం నుంచి తప్పించుకోవడానికి భక్తులు ఆలయ మాడవీధుల్లోకి పరుగులు తీయాల్సి వచ్చింది. వర్షం తగ్గే వరకు భక్తులు మాడవీధుల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వం వందల కోట్లతో నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయంలో.. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో కూడా రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.