- సిటీలో రోజంతా ముసురు, చల్లగా మారిన వాతావరణం
- మరో 2 రోజులు తేలికపాటి, మోస్తరు వానలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీని ముసురు వీడడం లేదు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన వాన బుధవారం ముసురుగా మారింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని ముసురు పడడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి నగరం చల్లగా మారింది. నగరంలో రాత్రి 8గంటల వరకు అత్యధికంగా శేరిలింగంపల్లిలో 1.83 సెంటిమీటర్లు, ఖైరతాబాద్ లో 1.58, బోరబండలో 1.45 సెంటిమీటర్లు, మైత్రివనంలో 1.35 సెంటిమీటర్లు కురిసింది.
సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను సీపీ సజ్జనార్ బుధవారం స్వయంగా పరిశీలించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ జంక్షన్‌ను సందర్శించిన ఆయన.. వర్షాల కారణంగా కలుగుతున్న ట్రాఫిక్ అంతరాయాలపై ట్రాఫిక్ ఎస్సై గోవర్ధన్ రెడ్డిని ఆరా తీశారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
