రాజీవ్‌‌‌‌ దూర దృష్టితోనే టెక్నాలజీలో దేశం ముందుకు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌

రాజీవ్‌‌‌‌ దూర దృష్టితోనే టెక్నాలజీలో దేశం ముందుకు : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌
  • 18 ఏండ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే: పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌
  • దేశంలో కుల, మత రాజకీయాలకు నూకలు చెల్లాయని కామెంట్‌‌‌‌
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ 

కరీంనగర్ / హైదరాబాద్, వెలుగు: భారతదేశ ఆధునీకరణకు ప్రాణం పోసిన మహానేత రాజీవ్ గాంధీ అని పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ పేర్కొన్నారు. రాజీవ్‌‌‌‌గాంధీ దూర దృష్టితోనే 21వ శతాబ్దంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు దూసుకెళ్తున్నదని చెప్పారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని రాజీవ్ చౌక్‌‌‌‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని  మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్​, ఎమెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శుక్రవారం మహేశ్‌‌‌‌గౌడ్​ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. ఆయన దూరదృష్టితో మన దేశానికి 20 ఏండ్ల ముందే  కంప్యూటర్ వచ్చిందని, టెలికాం రంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎందుకు బలైపోయారో ఈ దేశ యువత తెలుసుకోవాలని కోరారు. ప్రజలకు కావాల్సింది కులాలు, మతాలు కాదని, వారి పిల్లలకు విద్య, ఉద్యోగావకాశాలని పేర్కొన్నారు. అమాయక ప్రజలను కులాలు, మతాల పేరిట మోసం చేసే కాలం చెల్లిందని స్పష్టం చేశారు. 

ప్రకృతిని ధ్వంసం చేస్తే  దేశ భవిష్యత్తుకే ముప్పు

అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం దేశ భవిష్యత్తుకు తీరని నష్టం కలిగిస్తుందని మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. అండమాన్, -నికోబార్ దీవుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌‌‌గాంధీ చేస్తున్న పోరాటానికి పీసీసీ మద్దతు ప్రకటించిందని తెలిపారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహేశ్ గౌడ్  ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతమని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమం కేవలం ఆ దీవుల కోసమే కాదని, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ప్రకృతిని అందించేందుకేనని పేర్కొన్నారు. పర్యావరణహితమైన అభివృద్ధి విధానాలకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అండమాన్-, నికోబార్ దీవుల్లోని అపురూపమైన ప్రకృతి సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

రాజీవ్‌‌‌‌ గాంధీ స్ఫూర్తి ప్రదాత

ఈ దేశ ఐక్యత, సమగ్రత కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజీవ్ గాంధీ తమకు స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మంత్రులందరం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు తరాలకు తెలిసేలా సుడా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.