స్వగృహ ఫ్లాట్లకు 39 వేల అప్లికేషన్లు

స్వగృహ ఫ్లాట్లకు 39 వేల అప్లికేషన్లు
  • బండ్లగూడపై 75 శాతం మంది ఆసక్తి
  • స్వగృహ ఫ్లాట్లకు ముగిసిన దరఖాస్తుల గడువు
  • ఈనెల 22న ఫ్లాట్ల అలాట్ మెంట్
  • సౌలతులపై కొనుగోలుదారుల ఆందోళన
  • పార్కింగ్, పెండింగ్ నీటి బిల్లులు, ల్యాండ్ రేషియోపై స్పష్టత ఇవ్వని అధికారులు

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో అమ్మాకానికి ఉంచిన రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లకు దరఖాస్తుల గడువు ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 3,500 ఫ్లాట్లకు 39,082 అప్లికేషన్లు వచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క బండ్లగూడకే 29వేల అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. నాగోల్ మెట్రో నుంచి తక్కువ దూరంలో ఉండటం, మార్కెట్ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ ధరలకు సింగిల్, డబుల్, ట్రిపుల్,ట్రిపుల్ డీలక్స్ ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు బండ్లగూడకు మొగ్గుచూపారు. ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా రూ.900 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల రూపంలోనే రూ.3.5 కోట్లు (నాన్ రిఫండబుల్) సర్కారు ఖజానాకు చేరాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.3,000, రూ.2,750 ధర ఖరారు చేశారు. మార్కెట్ రేటుతో పోలిస్తే రాజీవ్ స్వగృహ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సింగిల్ బెడ్ రూమ్ రూ.18 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ రూ.35 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.50 లక్షల లోపే వస్తుండటంతో భారీ స్పందన వచ్చింది.

సౌలతులపై స్పష్టత లేదు
స్వగృహ అపార్ట్​మెంట్ల ప్రాంతంలో మౌలిక సదుపాయల విషయంలో స్పష్టత రావడం లేదు. బండ్లగుడలో ఇప్పటికే ఉన్న ప్లాట్ల యజమానులు ఇక్కడ పూర్తి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తక్కువ మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ అందరూ వస్తే మాత్రం మౌలిక సదుపాయలకు ఇబ్బందులు వస్తాయని స్థానికులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పార్కింగ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పలు రోడ్లలో ప్రత్యేకంగా మార్కింగ్ చేసి రూ.లక్షకు అమ్మకానికి పెట్టారు. అదే సెల్లార్ లో అయితే రూ. 2.25లక్షలు సిల్ట్ లో అయితే రూ.3.25లక్షలు చెల్లించాలి. ఇలా పార్కింగ్ రోడ్డు పై.. ఫుట్ పాత్ పై ఎర్పాటు చేస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. బిల్డర్లకు అమ్మకానికి పెట్టినప్పుడు మాత్రం పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు సామన్య ప్రజలకు మాత్రం రోడ్డు సైడ్ పార్కింగ్ ఎర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక రూల్స్ ప్రకారం 100 ప్లాట్లు ఉన్న ప్రతి అపార్టుమెంట్ కు కచ్చితంగా సీనరేజ్ ట్రీట్ ప్లాంట్ ఉండాలి. ఇక్కడ 2746ఇళ్లు ఉన్నా అధికారులు దాని ఊసే ఎత్తడం లేదు. వీటితోపాటు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ లేదని ఫ్లాట్లలో ఉన్న వాళ్లు అంటున్నారు. ప్రభుత్వ విభాగమే నిర్మించినప్పటికీ అన్ని రూల్స్ పాటించారా ఫైర్ సేఫ్టీ ఉన్నదా అనే అంశంపై స్పష్టత రావాలంటే మాత్రం ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ రావాల్సిందే అయితే ఇప్పటికీ అది జీహెచ్ ఎంసీ అధికారుల పరిశీలనలో ఉంది. పార్కింగ్ సదుపాయం లేకుండా సీనరేజ్ ట్రీట్ ప్లాంట్ లేకుండా ఎలా ఆక్యుపెన్సీ వస్తుందన్నది ఇప్పుడ ప్రశ్నార్థకంగా మారింది. 

ఇటీవల ఆందోళన
బండ్లగూడలో ఇటీవల అధికారులు ఏర్పాటు చేసిన మీటింగ్ వివాదాలకు దారి తీసింది. పార్కింగ్, సీనరేజ్ ప్లాంట్, నీటి బకాయిలు, ల్యాండ్ షేర్ పై కొనుగోలు దారులు అడిగిన ప్రశ్నలకు అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో ఈ మీటింగ్ రసాభాసాగా మారింది. ఇక ఇండ్ల అలాట్మెంట్ జరిగిన తరువాత ఎలాంటి అడ్డంకులు వస్తాయో అని అధికారులు హైరానా పడుతున్నారు.