ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టి, రేపు రిటైర్ కానున్న జస్టిస్ రంజన్ గొగోయ్.. ఈ 13 నెలల కాలంలోనే దేశ న్యాయ వ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. పోయినేడాది అక్టోబర్ 3న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు నిజానికి ఈ నెల 17న(ఆదివారం) లాస్ట్ వర్కింగ్ డే. కానీ ఈ రోజు (శనివారం) కోర్టు ప్రొసీడింగ్స్ జరగవు. ఆదివారం సెలవు. దీంతో రంజన్ గొగోయ్ శుక్రవారమే చివరి రోజుగా కోర్టు నంబర్–1లోని తన కుర్చీలో కూర్చున్నారు.
సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్–1 అంటే సీజేఐ కోర్టు రూమ్ అని అర్థం. శుక్రవారం అక్కడ ఆయన కేవలం నాలుగు నిమిషాలే గడిపారు. ఆ టైమ్‌లో గొగోయ్‌తోపాటు కాబోయే సీజేఐ ఎస్ఏ బోబ్డే, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేశ్ ఖన్నా ఉన్నారు. బార్ అసోసియేషన్ తరఫున రాకేశ్ ఖన్నా చీఫ్ జస్టిస్‌కి థ్యాంక్స్ చెప్పారు. శుక్రవారం చివరి వర్కింగ్ డే కావటంతో గొగోయ్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.
ఎన్ఆర్సీకి డెడ్‌లైన్ పెట్టారు
1954 నవంబర్ 18న పుట్టిన రంజన్ గొగోయ్.. అస్సాం మాజీ సీఎం కేశబ్ చంద్ర గొగోయ్ కొడుకు. 1978లో ‘బార్’లో జాయినై గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001లో పర్మనెంట్ జడ్జి అయ్యారు. 2010లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చారు. ఏడాది తర్వాత చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2012లో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జి అయినప్పటి నుంచే రంజన్ గోగోయ్ ఎన్నో మార్పులకు కారణమయ్యారు. ఎన్ఆర్సీ ప్రక్రియను మూడేళ్లలో పూర్తిచేయాలంటూ 2014లో కేంద్రాన్ని ఆదేశించిన ఇద్దరు జడ్జిల్లో ఈయనొకరు. రిటైరయ్యాక గౌహతిలోనే సెటిలవనున్నారు.
‘ఫాస్ట్ ట్రాక్’లోకి తెచ్చారు
జ్యుడీషరీతోపాటు సుప్రీంకోర్టు రెజిస్ట్రీలో రంజన్ గొగోయ్ ఎన్నో ర్యాడికల్ మార్పులు చేపట్టారు. కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండకుండా ఫాస్ట్‌గా విచారణకు రావటానికి రూట్ క్లియర్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 31 నుంచి 34కి పెంచారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నాటికే వీరంతా నియమితులయ్యారు. ఎక్కువ మంది హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ ఇచ్చిన ఘనత రంజన్ గొగోయ్‌కే దక్కింది. పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ బెంచ్‌ని ఏర్పాటుచేస్తారనే వార్తలు కూడా ఈయన హయాంలోనే వచ్చాయి.
అన్ని వర్గాల నుంచి ప్రశంసలు
లేటెస్ట్గా.. పిటిషన్ల ట్రాన్స్ఫర్ కేసుల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సింగిల్ జడ్జిలకే కట్టబెట్టారు. ‘ఏడేళ్లలోపు బెయిల్’కు సంబంధించిన అంశాన్నీ వాళ్ల పరిధిలోకే తెచ్చారు. సుప్రీంకోర్టు సహా మొత్తం జ్యుడీషరీపై ఆయన జరిపిన సమగ్ర పరిశీలన అద్భుతమని న్యాయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. 13 నెలల పదవీ కాలాన్ని రంజన్ గొగోయ్ పూర్తిగా వినియోగించుకున్నారని, సుప్రీంకోర్టు చరిత్రలో ఇలాంటి చీఫ్ జస్టిస్ ఈయన ఒక్కరేనని చెబుతున్నాయి. గడచిన పాతికేళ్లలో పలువురు జడ్జిలు సీజేఐలుగా పనిచేశారు. కొందరు ఈ పదవిలో కొన్ని నెలలే ఉన్నారు. మరికొందరు ఏడాది పాటు కొనసాగారు. కేజీ బాలకృష్ణన్ మాత్రమే మూడేళ్లకు పైగా ఉన్నారు. కానీ.. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సంస్కరణలను అమలుచేసిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమేననే అభిప్రాయం న్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన చేపట్టిన ఈ రిఫార్మ్స్ ప్రభావం దేశ న్యాయ వ్యవస్థపై కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని అంటున్నారు.

