
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రావు భేటీ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతానని కేసీఆర్ తో చెప్పారు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆనంద భాస్కర్ రావు ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద భాస్కర్ రావు కేసీఆర్ ను కొనియాడారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కీ రోల్ పోషించాలని ఆనంద్ భాస్కర్ రావు కోరారు. జర్నలిస్ట్ గా పనిచేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీజేపీలో చేరారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి నేతలు వలస వెళ్తున్నారు. ఇటీవల మునుగోడుకు చెందిన కీలక నేత, టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.