కేవైసీ చేయకుంటే నష్టపోతారు ! రేషన్ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి

కేవైసీ చేయకుంటే నష్టపోతారు ! రేషన్ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి
  • ఈ కేవైసీతో బోగస్ కార్డుల ఏరివేత 
  • ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
  • స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించినా గ్రామాల్లో ముందుకు రావడం లేదు. రెండున్నరేండ్లుగా ప్రభుత్వం రేషన్ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరని హెచ్చరించినా చాలా మంది ఆ ప్రక్రియ పూర్తి చేయడం లేదు. ఈ నెలాఖరు నాటికి ప్రతి లబ్ధిదారుడు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో ప్రతి లబ్ధిదారుడు ఈ కేవైసీ చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. పౌరసరఫరాల శాఖ డీలర్లను అలర్ట్ చేసింది. రెండు రోజులకోసారి ఆఫీసర్లు ఈ కేవైసీ నమోదుపై డీలర్లతో సమీక్ష నిర్వహిస్తూ నెలాఖరు నాటికి వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

నమోదుపై ఫోకస్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 248 జీపీల్లో 277 రేషన్ షాపులున్నాయి. ప్రతి లబ్ధిదారుడు ఈ కేవైసీ పూర్తి చేసుకునే విధంగా అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,39,291 కార్డులుండగా 3,94,568 మంది లబ్ధిదారులున్నారు. ఈ కేవైసీ ప్రక్రియ రెండున్నరేండ్లుగా కొనసాగుతున్న జిల్లా వ్యాప్తంగా 81.71 శాతం నమోదైంది.

కార్డుల్లో ఉన్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ వేలి ముద్రతో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే బయోమెట్రిక్ లో వేలి ముద్రలు రాకుంటే ఆధార్ సెంటర్ల వద్ద అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నమోదు కానీ వారిని గుర్తించి వారికి సమాచారం అందిస్తున్నారు.

జిల్లాలో భూపాలపల్లి 80.58, చిట్యాల 83.23, గణపురం 80.04, కాటారం 81.94, మహదేవపూర్ 78.40, మల్హర్ 82.06, మొగుళ్లపల్లి 85.62, మహాముత్తారం 81.44, పలిమెల 76.11, రేగొండ 82.61, టేకుమట్ల 84.59 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఏజెన్సీ గ్రామాలైన మహదేవపూర్, పలిమెల మండలాలు నమోదులో వెనకబడ్డాయి. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి వంద శాతం నమోదు కంప్లీట్ అయ్యేలా ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. 

రాయితీ ఎత్తివేత..
ఈ కేవైసీ అప్ డేట్ కాకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తివేసేందుకు సన్నద్ధం అవుతుందని ఆఫీసర్లు గ్రామాల్లో లబ్ధిదారులకు సమాచారం ఇస్తున్నారు. రేషన్ కార్డు ప్రమాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ కేవైసీ అప్ డేట్ ఉంటే పథకాల వర్తింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పెండింగ్ ఉన్న లబ్ధిదారులను లిస్ట్ ఔట్ చేసి డీలర్లకు జాబితా పంపించారు. ఈ కేవైసీ ప్రక్రియ వేగం పెంచాలని సూచనలు చేస్తున్నారు. 

నమోదు ప్రక్రియ వేగంగా చేస్తున్నాం..
జిల్లాలో ఈ కేవైసీ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఈ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వందశాతం కంప్లీట్ చేస్తాం. డీలర్లతో ఎప్పటికప్పుడు నమోదుపై సమీక్షలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.

కిరణ్ కుమార్, డీసీవో, భూపాలపల్లి