రేషన్ డీలర్ల కమీషన్ ఇకపై రూ.1,400

రేషన్ డీలర్ల కమీషన్  ఇకపై రూ.1,400

హైదరాబాద్‌‌, వెలుగు: రేషన్‌‌ డీలర్ల కమీషన్‌‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రస్తుతం టన్నుకు రూ.900 కమీషన్ ఇస్తుండగా, దాన్ని రేషన్ డీలర్ల కమీషన్ ఇకపై రూ.1,400 ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్‌‌లో జేఏసీ ప్రతినిధులతో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్, జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రధానమైన 13 డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రులు ఓకే చెప్పారు. సర్కార్ నిర్ణయంతో ఏటా రూ.139 కోట్ల అదనపు భారం పడుతుందని సివిల్ సప్లయ్స్ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. 

ఇవీ మిగతా డిమాండ్లు.. 

కరోనా సమయంలో మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్ షిప్‌‌లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రైతు బీమా తరహాలో రేషన్ డీలర్లకు రూ.5 లక్షల బీమా అమలు, ప్రతి డీలర్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి  తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్‌‌ షిప్ రెన్యూవల్ పీరియడ్ ను 5 ఏండ్లకు పెంచడం, డీలర్ల వయోపరిమితి 40 నుంచి 50 ఏండ్లకు పెంపు, డీలర్లు మరణిస్తే అంత్యక్రియల కోసం తక్షణ సాయం కింద రూ.10 వేలు మంజూరు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ ను కేసుల పరిధి నుంచి తొలగించడం, హైదరాబాద్‌‌ లో రేషన్ భవన్ నిర్మాణానికి భూమి కేటాయింపు తదితర మొత్తం 13 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. 

9 ఏండ్లలో 700 శాతం పెంచినం: మంత్రులు 

డీలర్ల కమీషన్ 9 ఏండ్లలో 700 శాతం పెంచామని మంత్రులు హరీశ్ రావు, గంగుల చెప్పారు. ‘‘రాష్ట్రం ఏర్పడినప్పుడు డీలర్ల కమీషన్ టన్నుకు రూ.200 ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.1,400 చేసినం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అదనంగా రేషన్ ఇవ్వడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఇస్తున్నం. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల కార్డులు ఉండగా, దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున అందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కార్డులకు సైతం అదనంగా కిలో కేటాయిస్తున్నం. డీలర్ల కమీషన్ సైతం కేంద్రం పెంచకున్నా, రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందిస్తున్నది” అని పేర్కొన్నారు.