కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలు తీస్కోవాల్సిందే : బీజేపీ నేత రవీంద్రనాయక్

కేసీఆర్ అవినీతిపై కేంద్రం  చర్యలు తీస్కోవాల్సిందే : బీజేపీ నేత రవీంద్రనాయక్
  • కేసీఆర్ అవినీతిపై.. కేంద్రం  చర్యలు తీస్కోవాల్సిందే
  • వచ్చేనెల15 వరకు డెడ్​లైన్​ : బీజేపీ నేత రవీంద్రనాయక్
  • లేదంటే తన దారి తాను చూస్కుంటనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ అవినీతిపై ఆగస్టు 15 లోగా చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తాను చూసుకుంటానని అల్టిమేటం ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఇటీవల వరంగల్​లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా తీసుకోవాలని కోరారు. వెంటనే చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని హైదర్​గూడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేశ సంపద దోచుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయిలో ఉన్న నేత విమర్శలు చేయరని, నరేంద్ర మోదీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ మాత్రం దళితులను సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.

రేవంత్ డైనమిక్ లీడర్

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ అనడాన్ని స్వాగతిస్తున్నానని రవీంద్రనాయక్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ పీసీసీ ప్రెసిడెంట్ అని పొగిడారు. వరంగల్​లో మోదీ సభకు తనకు ఆహ్వానం లేదని, అవమానం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బీజేపీలోకి వచ్చిందే కేసీఆర్​ను ఓడించేందుకని స్పష్టం చేశారు. బీజేపీలో బీసీలు ఎదుగుతున్న సమయంలో బండి సంజయ్​ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అన్యాయమన్నారు. ఆయనను తప్పించినప్పుడు మరో బీసీ నేతకు చాన్స్ ఇయ్యాల్సిఉండేదన్నారు.