రాయదుర్గం మెట్రో నుంచి టీ హబ్ వరకు స్కైవాక్..ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా నిర్మాణం

రాయదుర్గం మెట్రో నుంచి టీ హబ్ వరకు స్కైవాక్..ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా నిర్మాణం
  • టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీ-గేట్ వరకు టన్నెల్ 
  • ఫీల్డ్​ విజిట్ చేసిన సైబరాబాద్ సీపీ, అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు స్కై వాక్ నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దీన్ని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా టీ హబ్ వరకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎస్సీఎస్సీ (సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్​) సహకారంతో  వివిధ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనున్నట్టు సమాచారం. తొలి దశలో సుమారు 500 మీటర్ల పొడవు గల స్కైవాక్‌‌ నిర్మిస్తారు. అలాగే టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీ–గేట్ వరకు సుమారు 400 మీటర్ల పొడవైన అండర్‌‌పాస్ (టన్నెల్) నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

ఇతర ప్రాంతాలకూ విస్తరణ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేశ్​నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం ఫీల్డ్​లెవెల్​పరిశీలనకు వెళ్లింది. ఇందులో కూకట్‌‌పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి కుమార్, ఎస్సీఎస్సీ సీఈవో నావెద్ తో పాటు రహేజా మైండ్ స్పేస్, సత్వ, దివ్యశ్రీ, ఫీనిక్స్ గ్రూప్ సంస్థల ప్రతినిధులున్నారు. 

ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్ఏ) ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) నుంచి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు త్వరలో పంపనున్నారు. ఫ్యూచర్​లో ఈ స్కైవాక్​ను ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ, టీజీఐఐసీ, ఐఏఎల్​ఏ సమన్వయంతో  పర్యవేక్షించనున్నారు.