సరిహద్దు దేశాలతో.. రూపాయల్లో బిజినెస్​

సరిహద్దు దేశాలతో.. రూపాయల్లో బిజినెస్​

న్యూఢిల్లీ:మన రూపాయల్లో సరిహద్దు వాణిజ్యం కోసం దక్షిణాసియా దేశాలతో తామూ, ప్రభుత్వం చర్చిస్తున్నామని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. కేంద్రంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్యం కోసం రూపాయి సెటిల్​మెంట్​ విధానాన్ని మొదలు పెట్టామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఐఎంఎఫ్​ కాన్ఫరెన్స్​లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మేం ప్రయోగాత్మకంగా సెంట్రల్​బ్యాంక్​ డిజిటల్​ కరెన్సీ (సీబీడీసీ)ని కూడా మొదలుపెట్టాం. డిజిటల్​ రూపాయి లాంచ్​ విషయంలో చాలా  జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే  క్లోనింగ్​ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలోనూ దక్షిణాసియా దేశాల నుంచి సహకారం తీసుకోవచ్చు. వీటితో వ్యాపారాన్ని మరింత పెంచవచ్చు. దీనివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. కరోనా, ఇన్​ఫ్లేషన్​, రెసిషన్, రష్యా–యుద్ధం వంటి సమస్యలను దక్షిణాసియా దేశాలు ఎదుర్కోవాలి. యూపీఐ చెల్లింపుల కోసం నేపాల్​తోపాటు భూటాన్​ మాతో చేతులు కలిపింది. సరిహద్దు వాణిజ్యానికి కూడా యూపీఐని వాడుతాం. పోయిన నెల డిజిటల్​ రూపాయిని కూడా మొదలుపెట్టాం” అని అన్నారు.

ఇన్​ఫ్లేషన్​పై దృష్టి పెట్టాలి

ఇండియా వంటి దక్షిణాసియా దేశాలకు ఇన్​ఫ్లేషన్​ కట్టడి చాలా ముఖ్యమని శక్తికాంత దాస్​ ఈ సందర్భంగా అన్నారు. ధరలను అదుపులోకి తేకుంటే గ్రోత్​కు, ఇన్వెస్ట్​మెంట్లకు అడ్డుగోడగా నిలుస్తాయని చెప్పారు. పెరుగుతున్న అప్పులు, ధరలు దక్షిణాసియా దేశాల ఎకనమిక్‌​ గ్రోత్​కు అడ్డంకి అని, ఈ రెండింటినీ అదుపులోకి తేవాలని అన్నారు. వీటికి తోడు కరోనా కారణంగా వచ్చిన సప్లై చెయిన్ సమస్యలు, ఫుడ్​ క్రైసిస్​, యుద్ధం, ఫైనాన్షియల్​ మార్కెట్లలో ఆటుపోట్లు, వడ్డీ రేట్ల పెరుగుదల కూడా సమస్యలు తెచ్చిపెట్టాయని దాస్​ వివరించారు. 2022 మూడు క్వార్టర్లలో ఆహార ధరలు 20 శాతానికిపైగా పెరిగాయని అన్నారు. ‘‘ ఇటీవల ఇండియాలో ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. సప్లై చెయిన్​ సమస్యలూ తగ్గాయి  కాబట్టి ఇన్​ఫ్లేషన్​ దిగివస్తోంది. పెట్రో ప్రొడక్టుల కోసం విదేశాలపై మనం విపరీతంగా ఆధారపడుతున్నాం కాబట్టి ఆయిల్​ఇన్​ఫ్లేషన్​ను తగ్గించడం చాలా కష్టం. సరైన మానిటరీ, ట్రేడ్​ పాలసీ, సప్లై చెయిన్​ ఇబ్బందులను తొలగించడం, పాలనా పరమైన మార్పులు ఇన్​ఫ్లేషన్​ను తగ్గించడానికి సాయపడతాయి” అని శక్తికాంత దాస్​ వివరించారు.