న్యూఢిల్లీ: లోన్ల కిస్తీలు కట్టని వాళ్ల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి బ్యాంకులను అనుమతించకూడదని ఆర్బీఐ ప్రతిపాదించింది. మోటు పద్ధతుల్లో డబ్బుల వసూలుకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కొనుగోలుకు సదరు బ్యాంకే లోన్ ఇచ్చి ఉంటే మాత్రం కొన్ని షరతులతో కూడిన మినహాయింపు ఉంటుంది.
అలాంటి పరికరాల లోన్ ఈఎంఐ బకాయిపడి 90 రోజులు దాటినా, నోటీసులకు స్పందించకున్నా ఫోన్ ఫీచర్లను బ్లాక్ చేయొచ్చు. ఈ బ్లాకింగ్ సమయంలోనూ ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, ప్రభుత్వ నోటిఫికేషన్లు వంటి అత్యవసర సేవలను నిలిపివేయడానికి వీల్లేదు. వినియోగదారుడు బకాయిలు చెల్లించిన గంటలోపు ఫోన్ లాక్ తొలగించాలి.
ఆలస్యమైతే గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు పరిహారం చెల్లించాలి. సోషల్ మీడియాలో వేధించడం, బూతులు తిట్టడం, మితిమీరి కాల్స్ చేయడం వంటి కఠిన పద్ధతులు రికవరీ ఏజెంట్లు వాడకూడదు.
