ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం..! రాష్ట్రవ్యాప్తంగా 90 రీసైక్లింగ్ యూనిట్లు..

ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం..! రాష్ట్రవ్యాప్తంగా 90 రీసైక్లింగ్ యూనిట్లు..
  • స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.57.60 కోట్లతో ప్రాజెక్టు
  •  31 జిల్లాల్లో 90 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌‌మెంట్ యూనిట్ల ఏర్పాటు
  •  రోజుకు రెండు టన్నుల ప్లాస్టిక్ రీసైక్లింగ్ సామర్థ్యం
  •  మహిళా సంఘాల ద్వారా నిర్వహణ.. వందల మందికి ఉపాధి
  •  భూ సమస్యలతో కొన్నిచోట్ల నిర్మాణాలు ఆలస్యం

పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణ చేపట్టింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.57.60 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 90 క్లస్టర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రోజుకు రెండు టన్నుల ప్లాస్టిక్‌‌ను రీసైక్లింగ్ చేసే ఈ యూనిట్లు పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ సర్కార్​ స్వచ్ఛ భారత్​ మిషన్​ కింద క్లస్టర్​ ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్(సీపీడబ్ల్యూఎం)లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 90 యూనిట్లను సాంక్షన్​ చేసింది. ఒక్కో యూనిట్​కు రూ.64 లక్షల చొప్పున మొత్తం రూ.57.60 కోట్లను వెచ్చిస్తోంది. 

ఇందులో రూ.40 లక్షలతో షెడ్లు నిర్మించడంతో పాటు మిగతా రూ.24 లక్షలతో ప్లాస్టిక్​ రీసైక్లింగ్​ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే పలుచోట్ల భూ సమస్యల కారణంగా యూనిట్ల నిర్మాణాలు ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

రాష్ట్రంలో 90 యూనిట్లు..

రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్​ వినియోగం పర్యావరణానికి ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ యూనిట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. నాలుగైదు మండలాలను ఒక క్లస్టర్​గా చేసి క్లస్టర్​కు ఒక యూనిట్​ చొప్పున 31 జిల్లాల్లో మొత్తం 90 యూనిట్లను సాంక్షన్​ చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్​లలో రెండు యూనిట్లు మంజూరయ్యాయి. 

నల్గొండలో ఐదు, ఖమ్మం, నాగర్​కర్నూర్​, నిజామాబాద్​, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు నాలుగు చొప్పున సాంక్షన్​ చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్​, మహబూబాబాద్​, మహబూబ్​నగర్​, మెదక్​, మేడ్చల్​, ఆదిలాబాద్​ జిల్లాలకు మూడు యూనిట్ల చొప్పున కేటాయించారు. ఇక కామారెడ్డి, జనగామ, జోగులాంబ గద్వాల, ములుగు, కరీంనగర్​, నారాయణపేట, పెద్దపల్లి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, జయశంకర్​ భూపాలపల్లి, వరంగల్​, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెండేసి యూనిట్లు సాంక్షన్​ చేశారు. 

రోజుకు రెండు టన్నుల ప్లాస్టిక్​ రీసైక్లింగ్..

ఒక్కో క్లస్టర్​ పరిధిలో రోజుకు రెండు టన్నుల ప్లాస్టిక్​ వేస్టేజ్​ రీసైక్లింగ్​ కెపాసిటీతో ఈ యూనిట్లను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో సేకరించిన ప్లాస్టిక్​ వ్యర్థాలను యంత్రాల్లో కరిగించి ముద్ద(బేలింగ్​)గా తయారు చేస్తారు. వీటితో వివిధ ఉత్పత్తులు తయారు చేయడమే గాకుండా పునర్వినియోగానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేసి ల్యాండ్​ ఫిల్లింగ్​కు వాడుతారు. 

తద్వారా పర్యావరణానికి ప్లాస్టిక్​ సమస్యను నివారించవచ్చు. అంతేగాకుండా ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ యూనిట్ల నిర్వహణను మహిళా గ్రూపులకు అప్పగించడం ద్వారా వందల మందికి ఉపాధి లభిస్తుంది.