బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు కొంటలేరు!

బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు కొంటలేరు!
  • ఏటా రూ. 300 కోట్ల బిజినెస్
  •  ఈ ఏడాది 20% కూడా కాలే

జూన్‍ నెల వచ్చిందంటే పేరెంట్స్ కు టెన్షన్‍ తప్పదు. స్కూల్‍ ఫీజులకుతోడు వేలాది రూపాయలుపెట్టి పిల్లలకు బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు కొనాల్సిందే. ప్రతి ఏటా ఈ సమయంలో వేలాది బుక్‍స్టాల్స్, స్కూల్‍ మేనేజ్‍మెంట్‍ఆధ్వర్యంలో నడిపే టెంపరరీ బుక్‍స్టాల్స్​వద్ద క్యూ లైన్లు ఉండేవి. కానీ ఈ ఏడాది ఎక్కడా ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. స్కూళ్లు తెరవకపోవడం.. తరగతులు నడవకపోవడంతో తల్లిదండ్రులు ఎవరూ బుక్‍స్టాల్స్​వైపు వెళ్లడం లేదు. అక్కడో ఇక్కడో ఆన్‍లైన్‍ క్లాసులు నడిచినా గతేడాది మార్కెట్‍తో పోలిస్తే.. 15_20 శాతం కూడా అందుకోలేకపోతోంది. దసరా తర్వాతే స్కూళ్లు తెరిచే అవకాశం ఉంది. అకడమిక్‍ ఇయర్‍ వృథా కావొద్దనే ఉద్దేశంతో  సిలబస్ తగ్గిస్తే.. అంతేస్థాయిలో వీటి కొనుగోలు తగ్గనుంది.

రెండు నెలలు.. ఫుల్​ బిజినెస్​

ఏటా జూన్‍, జులై నెలలు నోట్‍బుక్స్,  రీడింగ్‍బుక్స్,​  స్టేషనరీ అమ్మకాలకు ఫుల్​మార్కెట్‍ ఉంటుంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కాపీలు, పుస్తకాలు, పెన్ను, పెన్సిల్‍, రబ్బర్‍, డ్రాయింగ్‍షీట్స్, స్కెచ్‍పెన్నులు.. ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంతా స్టేషనరీ కొనక తప్పదు. తక్కువలో తక్కువ రూ.5 వేలకు తగ్గదు. చదివే స్కూల్‍, తరగతి ఆధారంగా రూ.15 వేల నుంచి 20 వేలు వీటికి ఖర్చు చేసే పేరేంట్స్​లక్షల్లో ఉంటారు. కరోనా కారణంగా ప్రస్తుతం అన్ని ఎడ్యుకేషన్‍ సెంటర్లు మూతపడటంతో పేరెంట్స్​ఈ తరహా ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేదు. కొన్ని స్కూళ్లు ఆన్‍లైన్‍ క్లాసెస్‍ నడిపినా.. తల్లిదండ్రులు ఒక రఫ్‍బుక్‍, మరో  రెండు నోట్‍బుక్స్​తప్పించి పూర్తిస్థాయి స్టేషనరీ కొనడం లేదు. నోట్‍బుక్స్​తయారీకి సంబంధించి రాష్ట్రంలో మూడు కంపెనీలు చాలా ఫేమస్‍. రాష్ట్రవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.150 కోట్ల బిజినెస్‍ ఆ మూడు కంపెనీల సొంతం. ఇవేగాక హైదరాబాద్‍, జిల్లాల్లో లోకల్‍గా ద్వితీయశ్రేణి బుక్‍  బైండింగ్​ వర్క్​సెంటర్లు వందలాదిగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మరో రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల బిజినెస్‍ ఉంది. ఇవేగాక రీడింగ్​ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్కెచ్‍ పెన్నులు, డ్రాయింగ్​ షీట్లు వంటివి కలిపితే మొత్తంగా రూ.300 కోట్ల పైచిలుకు బిజినెస్‍ కేవలం ఈ రెండు నెలల్లోనే ఉంటుంది. ప్రస్తుతం స్కూళ్లు మూతపడటంతో బయట పుస్తకాలు అమ్మేషాపుల వద్ద కస్టమర్లు కనపడటం లేదు. ఇదే సీజన్‍లో గతేడాది ఉన్న గిరాకీలో ఇప్పుడు కనీసం 20 శాతం దాటట్లేదని షాపుల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డర్లు రాక.. ఏం చేయాలో తెలియక..

రాష్ట్రంలో ప్రధాన పేపర్‍ కంపెనీలన్నీ అకడమిక్‍ ఇయర్‍ ఆధారంగా తమ స్టాక్‍ రెడీ చేసి పెట్టుకుంటాయి. ఏజెన్సీలు ముందస్తుగా ఆయా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి అడ్వాన్సులు చెల్లిస్తాయి. దీనికోసం అక్టోబర్‍, నవంబర్‍లోనే కంపెనీలు లోకల్‍గా భద్రాచలంతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పేపర్‍ కొనుగోలు చేసి నోటుబుక్స్​తయారీలో నిమగ్నమవుతాయి. ఈ ఏడాది సైతం అలానే చేశారు. తీరా.. ఆర్డర్లు వచ్చే టైంలో కరోనా మొదలవడంతో ఎక్కడి స్టాక్‍ అక్కడే గోదాముల్లో మూలుగుతోంది. గతంలో ఆర్డర్లు ఇచ్చినవారు కూడా ఇప్పుడు అవి క్యాన్సిల్‍ చేసుకుంటున్నారు. అకడమిక్‍ ఇయర్‍ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో  తెలియకపోవడంతో ఆయా కంపెనీలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. యూనిట్లు నడిపే క్రమంలో  వందలాది మందికి కూర్చోబెట్టి జీతాలు చెల్లించలేక సతమతమవుతున్నారు. బిగ్‍ ఇండస్ట్రీస్‍ మరో  రెండు, మూడు నెలలు నెట్టుకొచ్చే అవకాశం ఉన్నా.. కుటీర పరిశ్రమలా నడిచే చిన్నతరహా బుక్‍బైండింగ్‍ వర్క్ పై మాత్రం తీవ్ర ప్రభావం పడుతోంది.