
హైదరాబాద్, వెలుగు: సరోగసీ కేంద్రాలతోపాటు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ అన్నీ కొత్త చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ బుధవారం ప్రకటించింది. ఇందుకోసం http://registrysurrogacy.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలు నింపిన తర్వాత దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకుని కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసులో అందజేయాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం లెవల్ వన్ ఏఆర్‌టీ క్లినిక్స్ రూ.50 వేలు, లెవల్ 2 ఏఆర్‌టీ క్లినిక్స్, సరోగసి కేంద్రాలు రూ.రెండు లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ డబ్బులను సుల్తాన్‌బజార్‌లోని యూనియన్ బ్యాంక్‌లో ఉన్న పీసీపీఎన్‌డీటీ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని, దరఖాస్తు ఫారంతో పాటే డిపాజిట్ వివరాలను కూడా అందజేయాలని పేర్కొంది. అకౌంట్ వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది. కేంద్రం తీసుకొచ్చిన రెండు చట్టాల ప్రకారం ఇప్పటికే ఉన్న క్లినిక్స్, కొత్తగా ఏర్పాటు చేయబోయే క్లినిక్స్ అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాలను ఇటీవలే రాష్ట్ర సర్కార్ అడాప్ట్ చేసుకుంది.