హైడ్రోజన్​ బిజినెస్​పై  రిలయన్స్​ గురి

హైడ్రోజన్​ బిజినెస్​పై  రిలయన్స్​ గురి

న్యూఢిల్లీ:బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌‌‌  గ్రీన్ ఎనర్జీ వైపు గురిపెట్టింది. పర్యావరణానికి మేలు చేసే ఈ ఇంధనాన్ని  పెద్ద ఎత్తున, చౌకగా తయారు చేయడానికి రెడీ అయింది. ఇండియాను హైడ్రోజన్​ హబ్​గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీని తయారీకి కావాల్సిన జనరేషన్ ప్లాంట్లు, సోలార్ ప్యానెల్స్,  ఎలక్ట్రోలైజర్ల తయారీ సహా రెన్యువబుల్​ ఎనర్జీ ఇన్​ఫ్రా కోసం 75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.63 లక్షల కోట్లు)పెట్టుబడి పెట్టనుంది. అన్ని రకాల క్లీన్​ఎనర్జీలను హైడ్రోజన్‌‌గా మార్చాలనే ఆలోచనతో కంపెనీ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. హోల్​సేల్​ ఎలక్ట్రిసిటీకి బదులు హైడ్రోజన్​పై ఫోకస్​ చేస్తామని రిలయన్స్​వర్గాలు తెలిపాయి. ఎందుకంటే కరెంటు సరఫరా కంపెనీలు నష్టాల వల్ల ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నాయి. చెల్లింపులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడుతున్నాయి.  గ్రీన్ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ  మొత్తం వాల్యూ చెయిన్​ను దక్కించుకోవడానికి రిలయన్స్ సిద్ధమవుతోందని  ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సీఈఈడబ్ల్యూలోని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ గగన్ సిద్ధూ అన్నారు.  

గ్రీన్ హైడ్రోజన్​ను -- నీరు, క్లీన్​ ఎలక్ట్రిసిటీతో  తయారు చేస్తారు. ఎమిషన్స్​తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడంలో దీని తయారీ కీలకమని పర్యావరణరంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్లతోపాటు స్టీల్​వంటి ఇండస్ట్రీలకు లోకార్బన్ గల ఫ్యూయల్​ లభ్యమవుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌‌హౌస్ వాయువులను విడుదల చేసే దేశాల్లో ఇండియాది మూడోస్థానం.   కేవలం హైడ్రోజన్‌‌ కోసం ఎంత మొత్తం ఖర్చు చేస్తారో రిలయన్స్ వెల్లడించనప్పటికీ, క్లీన్ ఎనర్జీ కోసం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడి మాత్రం మనదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్​మెంట్​. అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్,  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ఇతర కంపెనీలు కూడా గ్రీన్ హైడ్రోజన్ కోసం ప్లాన్లను తయారు చేసుకుంటున్నాయి.  హైడ్రోజన్ ప్లాన్లు ఉన్న దేశాల సంఖ్య గత సంవత్సరం నాటికే రెట్టింపై 26కి చేరింది. అమెరికా, బ్రెజిల్, ఇండియా,  చైనాలు ఉత్పత్తిని పెంచితే గ్లోబల్ మార్కెట్లో సరఫరా బాగా పెరుగుతుందని గ్లోబల్​ మీడియా కామెంట్​ చేసింది. సమస్య ఏంటంటే..  ఇది లాభదాయక వ్యాపారంగా ఇప్పటికీ ఎదగలేదు. హైడ్రోజన్​ తయారీ కోసం ఇండియా.. అంబానీ, అదానీతో సహా దేశంలోని ఇతర బిలియనీర్ల కంపెనీలపై ఆధారపడుతోంది. తక్కువ ఖర్చులతో దీన్ని తయారీ చేయడం ఒక పెద్ద సవాలు. రెన్యువబుల్​ ఎనర్జీల ద్వారా తయారయ్యే గ్రీన్ హైడ్రోజన్ ధర ఇతర ఇంధనాలతో పోలిస్తే  చాలా ఎక్కువ. బొగ్గును ఉపయోగించి తయారు చేసే కరెంటు ధర కంటే దాదాపు రెట్టింపు ధర ఉంటుంది. 

అంబానీ టార్గెట్​చేరుకుంటారా ?

గ్రీన్ హైడ్రోజన్‌‌ను కిలో ధరను డాలర్​ కంటే తక్కువకు తీసుకొస్తామని అంబానీ గతంలోనే మాటిచ్చారు. ప్రస్తుత ధర కంటే ఇది 60శాతం తక్కువ.   పదేళ్లలోపు టార్గెట్​ను  సాధిస్తామని అంబానీ గత సంవత్సరం చెప్పారు. ఈ విషయమై డెలాయిట్ టచ్ తోమత్సులో సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ దేవాశిష్ మిశ్రా మాట్లాడుతూ ధరను డాలర్​ కంటే తక్కువకు తీసుకురావాలంటే  గ్రీన్ హైడ్రోజన్‌‌ తయారీకి కావాల్సిన ఎలక్ట్రోలైజర్‌‌ల ధరలు విపరీతంగా దిగిరావాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేగాక సామర్థ్య వినియోగం 80శాతం కంటే ఎక్కువ అవసరమని,  కిలోవాట్అవర్ సరఫరా ​ధర 3 సెంట్ల కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేశారు. రోజంతా స్టోరేజీ, హైడ్రోపవర్​ అందుబాటులో ఉండాలని మిశ్రా వివరించారు.