రిలయన్స్ పవర్ సీఎఫ్‌‌‌‌ఓ అరెస్ట్.. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసులో అదుపులోకి..

రిలయన్స్ పవర్ సీఎఫ్‌‌‌‌ఓ అరెస్ట్.. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసులో అదుపులోకి..

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ సీఎఫ్​ఓ  అశోక్ పాల్​ను మనీ లాండరింగ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ కేసు సుమారు రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ వ్యవహారానికి సంబంధించినదని తెలిపింది. పాల్​ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరామని ఈడీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్​యూ బీఈఎస్​ఎస్ లిమిటెడ్ తరపున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ)కు సమర్పించిన రూ. 68.2 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ నకిలీదని తేలింది. 

నకిలీ గ్యారెంటీలను జారీ చేస్తున్న ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్​లింక్ కంపెనీ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు. ఈ కేసు ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ నవంబర్ 2024లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్​ చేసింది. ఈ కంపెనీ 8 శాతం కమీషన్​కు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు జారీ చేసినట్లు ఆరోపించింది.  నకిలీ బిల్లులు, లెక్కల్లో చూపని బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది.